
పోటీ చేసే ఉద్దేశం లేదు
‘‘రాష్ట్ర విభజన వల్ల కొందరు ఆనందంతో ఉంటే... ఇంకొందరు బాధలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి దిగడం సమంజసం కాదు’’ అని సుమన్ అన్నారు. తాను ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ... మంగళవారం ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు సుమన్. ‘‘నేను ఏ పార్టీలోనూ లేను. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశమే ఉంటే.. స్వయంగా వెల్లడిస్తాను. వివిధ పార్టీల్లో ఉన్న నా మిత్రులు కూడా ప్రచారం చేయమని అడుగుతున్నారు. ఇప్పటివరకూ ఏ అభిప్రాయానికీ నేను రాలేదు’’ అని తెలిపారు. ఈ నెలాఖరు వరకూ బాలీవుడ్ ‘గబ్బర్’ షూటింగ్‌లో తాను బిజీగా ఉంటానని సుమన్ వెల్లడించారు.