
కాళ్ల బేరానికి వచ్చిన కరణ్ జోహార్
ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఎట్టకేలకు కాళ్లబేరానికి వచ్చాడు. కొంతమంది తనను జాతి వ్యతిరేకిగా ముద్రవేయడంతో చాలా బాధపడ్డానని, అందుకే ఇన్నాళ్లూ బయటకు రాలేదని అన్నాడు. పాకిస్థానీ హీరో నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు చిక్కులు ఎదురు కావడంతో మొదట్లో కళాకారులు వేరు, దేశాల మధ్య గొడవలు వేరన్న కరణ్.. ఇప్పుడు తన సినిమా విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ వీడియో సందేశం ఒకటి పెట్టాడు. ఉగ్రవాదాన్ని తాను గట్టిగా ఖండిస్తానని, మన సైన్యాన్ని గౌరవిస్తానని.. తనకు దేశమే ముఖ్యమని అన్నాడు. ఇన్నాళ్ల బట్టి తీవ్రంగా బాధపడటం వల్లే మౌనంగా ఉన్నట్లు చెప్పాడు.
పాకిస్థాన్‌కు చెందిన ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా నిజానికి దీపావళికి విడుదల కావాల్సి ఉంది. అయితే, 450 మంది సినిమా థియేటర్ల యజమానుల సంఘం కూడా పాకిస్థానీ నటులున్న సినిమాలను ప్రదర్శించేది లేదని స్పష్టం చేసింది. మొదట్లో కేవలం ఎంఎన్ఎస్ మాత్రమే ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినా.. తర్వాత క్రమంగా అది కాస్తా ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయింది. పాకిస్థానీ నటీనటులంతా 48 గంటల్లోగా దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే హెచ్చరించారు. తర్వాత గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోని సినిమా థియేటర్ల యజమానుల సంఘం సైతం సినిమాను ప్రదర్శించేది లేదని స్పష్టం చేసింది. ఇవన్నీ ఎక్కువగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు.
కశ్మీర్‌లోని ఉడి ప్రాంతంలో పాక్ మూకలు ఉగ్రదాడికి పాల్పడి 19 మంది సైనికులను కిరాతకంగా హతమార్చడం.. ఆ తర్వాత జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నిర్మాతల మండలి ఒకటి భారతీయ సినిమాల్లో పాకిస్థానీ నటీనటులు చేసేందుకు వీల్లేదంటూ నిషేధం కూడా విధించింది. దానికి ప్రతీకారంగా.. భారతీయ సినిమాలను తాము ప్రదర్శించేది లేదని పాకిస్థాన్‌కు చెందిన థియేటర్ యజమానులు ప్రకటించారు. దాంతో.. ఫవాద్‌ఖాన్‌ను సినిమా నుంచి తప్పించకపోతే ఏ దిల్ హై ముష్కిల్ సినిమా ఆడనిచ్చేది లేదని కరణ్ జోహార్‌కు బెదిరింపులు వచ్చాయి. ఆ సమయంలో బాలీవుడ్ పరిశ్రమ చాలావరకు కరణ్‌కు అండగా నిలిచింది. అయినా ప్రయోజనం లేకపోయింది. పార్టీలు కాకుండా థియేటర్ యజమానులు సైతం సినిమాను ప్రదర్శించబోమని చెప్పడంతో.. ఇప్పుడు కరణ్ జోహార్ కాళ్ల బేరానికి వచ్చాడు. దేశభక్తిని ప్రదర్శించడానికి ఉత్తమ మార్గం ప్రేమను పంచడమేనని, అది తాను తన సినిమాల ద్వారా చేస్తున్నానని అన్నాడు. తాను ఏ దిల్ హై ముష్కిల్ సినిమా తీసేటప్పటికి ఇరు దేశాల సంబంధాలు బాగానే ఉండేవని, ప్రభుత్వం కూడా పాకిస్థాన్‌తో స్నేహ సంబంధాల కోసమే ప్రయత్నించిందని కరణ్ తన వీడియో సందేశంలో చెప్పాడు. కానీ ఇప్పుడు సెంటిమెంట్లు వేరుగా ఉన్నాయని, వాటిని తాను గౌరవిస్తానని అన్నాడు. ఇక మీదట తాను పాకిస్థానీ నటీనటులతో సినిమాలు చేయబోనని.. కానీ, తన సినిమాలో దాదాపు 300 మందికి పైగా భారతీయులు కూడా పనిచేశారని అన్నాడు. వాళ్లంతా తమ రక్తం, చెమట ధారపోశారని చెప్పాడు. వాళ్లు ఇబ్బంది పడటం సరికాదని భావిస్తున్నట్లు తెలిపాడు. అలా పరోక్షంగా.. తన సినిమా విడుదలకు ఆటంకాలు కలిగించవద్దని కోరాడు. అయితే ఇది ఎంతవరకు ఫలిస్తుందన్నది మాత్రం వేచి చూడాల్సిందే.