నా స్థానాన్ని ఎవరూ దక్కించుకోలేరు
చెన్నై : అందంగా, కుందనపు బొమ్మగా ఉండే అమ్మాయిలను బాపు బొమ్మ అంటారు. అలా చిత్రపరిశ్రమలో ఎక్స్‌ట్రార్డనరీ అందాలకు సొంతదారి అయిన నటి తమన్న పాలరాతి బొమ్మగా పిలవబడుతోంది. ఈ ఉత్తరాది భామకు శరీరానందమే కాదు, ఆత్మవిశ్వాసం మెండే. అలాగే తనపై తనకు నమ్మకం ఎక్కువ. మనసులో మాట చెప్పడానికి ఏ మాత్రం సంకోచించరు. తన వృత్తి, పోటీ తదితర అంశాలపై తమన్న అభిప్రాయాలేమిటో చూద్దాం.
కొత్త వాళ్లు రావాలి
చిత్ర పరిశ్రమలోకి కొత్త కొత్త నటీమణులు రావడంతో పోటీ తప్పనిసరిగా ఉంటుందంటున్నారు. నిజానికి అలాంటిదేమీ లేదు. ఇప్పుడు ఏడాదికి 150 చిత్రాలకు పైగా నిర్మాణం అవుతున్నాయి. వాటన్నిటిలోనూ కొద్ది మంది నాయికలతోనే పూర్తి చేయలేరు. కాబట్టి కొత్తవారు రావాలి. వాళ్ల వల్ల నాలాంటి ప్రముఖ కథానాయికల మార్కెట్‌కు ముప్పు ఏర్పడుతుందని భయపడాల్సిన అవసరం లేదు. నా స్థానం ఎప్పుడూ నాకు ఉంటుంది. దాన్ని ఎవరూ దక్కించుకోలేరు. డబ్బు, ప్రఖ్యాతలపై నాకు ఆరాటం లేదు. భవిష్యత్ లక్ష్యం అంటూ ఏమీలేదు.
ఏదీ నిరంతరం కాదు
ఇక్కడ నిరంతరం అంటూ ఏదీ లేదు. నేటి స్థానం రేపు మారుతుంది. నేను కథ నచ్చితేనే నటిస్తున్నాను. దర్శకుడి సూచనలకనుగుణంగా నటిస్తున్నాను. జయాపజయాలను సమంగా స్వీకరిస్తాను.నేను నటించిన చిత్రం ఫ్లాప్ అయితే బాధగానే ఉంటుంది.అయితే దాన్నే తలచుకుంటూ చింతిస్తే తదుపరి చిత్రానికి న్యాయం చేయలేం. అదృష్టం ఉంటే సినిమా విజయం సాధిస్తుంది. కాకపోయినా పట్టించుకోను. ఇక భాషాభేదం చూపను. ఏ భాషలో మంచి కథ లభిస్తే అది చేయడానికి సిద్ధమే.
ప్రముఖ కథానాయకులతో నటిస్తున్నప్పుడు వారికి ధీటుగా పేరు తెచ్చుకోవాలన్న ఆశతో పోటీపడి నటించడానికి కఠినంగా శ్రమిస్తాను. ఇక ఫలితం మన చేతిలో లేదు.అదే విధంగా ఇద్దరు కథానాయికలు ఒకే చిత్రంలో నటిస్తున్నప్పుడు గొడవలు జరుగుతాయంటారే? అని అడుగుతుంటారు. అయితే అలాంటి సందర్భాలు నాకు ఎదురవ్వలేదు. చిన్న చిన్న మనస్పర్థలు తలెత్తవచ్చు. శత్రుత్వం పెంచుకునే సందర్భాలు రాలేదు.
అవి ఒకప్పుడు బాధించాయి
నేను పరిచయం అయినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. నా తల్లిదండ్రులు నాకు పూర్తి స్వాతంత్య్రం ఇచ్చారు. దాన్ని తప్పుగా వాడుకోను. ఇక గ్యాసిప్స్ గురించి అడుగుతుంటారు. మొదట్లో అలాంటి వాటి గురించి బాధ అనిపించిన మాట వాస్తవం. ఆ తరువాత వాటి గురించి పట్టించుకోవడం మానేశాను.