బలమైన కోరిక కాబట్టే నెరవేరిందేమో!
‘‘పెద్దయ్యాక నువ్వు ఏం కావాలనుకుంటున్నావ్?’’ అని చిన్నపిల్లలను అడిగితే, డాక్టర్ అనో, పోలీస్ అనో, హీరో అనో, హీరోయిన్ అనో.. ఇలా ఎవరికి తోచినది వాళ్లు చెబుతుంటారు. తమన్నా అయితే ‘నేను డాక్టర్ అవుతా... హీరోయిన్ అవుతా’ అని రెండు కోరికలు చెప్పేవారట. ఆ విషయం గురించి తమన్నా ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ - ‘‘చిన్నపిల్లలు ముద్దుగా ఉంటారు కాబట్టి, ఏదో ఒకటి మాట్లాడించాలని ‘పెద్దయ్యాక ఏమవుతావ్?’ అని అడుగుతుంటారు. అప్పుడు పిల్లలు వాళ్ల నోటికి ఏది వస్తే అది చెప్పేస్తారు.
చిన్నప్పుడు చెప్పిన ప్రొఫెషన్స్‌లో పెద్దయ్యాక సెటిల్ అయ్యేవాళ్లు ఏ కొద్దిమందో ఉంటారు. ఏజ్ పెరిగే కొద్దీ అభిప్రాయాలు మారుతుంటాయి. నన్నే తీసుకోండి. డాక్టర్, యాక్టర్ రెండు ప్రొఫెషన్స్ గురించి చెప్పేదాన్ని. కానీ, పెద్దయ్యాక వైద్య వృత్తి గురించి అస్సలు ఆలోచించలేదు. పదమూడేళ్ల వయసులో సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. చిన్నప్పుడు నేను చెప్పిన రెండు కోరికల్లో అది కూడా ఒకటి కాబట్టి, ఒప్పేసుకున్నాను. బహుశా ఎక్కడో ఒక మూల హీరోయిన్ కావాలనే కోరికే బలంగా ఉండి ఉంటుందేమో. అందుకే డాక్టర్‌ని కాకుండా యాక్టర్‌ని అయిపోయాను. ఒకవేళ సినిమాలకు అవకాశం రాకపోయి ఉంటే అప్పుడు డాక్టర్‌గా సెటిలై ఉండేదాన్నేమో’’ అని చెప్పారు.