అలా చేస్తే నాకు వళ్లు మండుతుంది!
‘‘కళకు భాషాభేదం లేదు. అలాగే కళాకారులకు రిటైర్‌మెంట్ కూడా ఉండదు. వంట్లో ఓపిక, యాక్ట్ చేసే సత్తా తగ్గనంత కాలం ఆర్టిస్టులుగా కొనసాగవచ్చు’’ అంటున్నారు ప్రియాంక చోప్రా. ఆమె ఇలా అనడానికి కారణం ఉంది. ‘మీరు సినిమాల్లోకొచ్చి పదకొండేళ్లయ్యింది కదా.. రిటైర్‌మెంట్‌కి దగ్గర పడుతున్నారేమో?’ అనే అర్థం వచ్చేట్లుగా ఇటీవల ఎవరో ప్రియాంక దగ్గర అన్నారట. ఆ విషయం గురించి మాట్లాడుతూ -
‘‘హీరోయిన్ల వయసు, వాళ్ల కెరీర్ ట్రాక్ రికార్డ్ గురించి ఎవరైనా లెక్కలేస్తే నాకు వళ్లు మండుతుంది. హీరోల దగ్గరకెళ్లి రిటైర్‌మెంట్ గురించి మాట్లాడగలరా? వాళ్లకి లేని నిబంధనని మాకెందుకు పెడతారు? అయినా మా విరమణ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు చూసినంత కాలం మేం నిక్షేపంగా సినిమాలు చేస్తాం. నాకన్నా వయసు ఎక్కువ ఉన్న హీరోలతో పాటు, నా వయసున్న హీరోల సరసన నేను సినిమాలు చేస్తున్నాను. ఎవరి పక్కన చేసినా వాళ్లకి సరిజోడీ అనిపించుకుంటున్నాను.
నా అంత కెరీర్ ఉన్న బిపాసా బసు, కరీనా కపూర్ కూడా ఏ హీరోతో చేస్తే ఆ హీరోకి తగ్గట్టుగా ఉంటారు. నాలానే పదకొండేళ్ల కెరీర్ ఉన్న కత్రినా కైఫ్ కూడా అంతే. అలాంటప్పుడు మేం వచ్చి పదేళ్లకు పైగా అయ్యింది కాబట్టి, ఇక సినిమాలకు పనికి రాకుండా పోతాం అని ఎలా అనుకుంటారు? హాలీవుడ్‌ని చూసి ఇక్కడివాళ్లు నేర్చుకోవాలి. అక్కడ వయసుతో సంబంధం లేదు. 40, 50, 60, 70లలో కూడా మగవాళ్లు హీరోలుగా కొనసాగినట్లే ఆడవాళ్లు హీరోయిన్లుగా చేస్తారు. ఇక్కడ కూడా అది పాటిస్తే
ఉత్తమం’’ అని చెప్పారు ప్రియాంక.