ఇక్కడ ఎవరూ ఎవర్నీ నియంత్రించలేరు!
‘‘నేను 1996లో పరిశ్రమకు వచ్చాను. అప్పట్నుంచీ సురేశ్‌బాబుతో స్నేహం ఉంది. సురేశ్ ప్రొడక్షన్స్‌లో వర్క్ చేశాను. ఈ బేనర్లో ైడెరైక్షన్ చేయడం అనేది ఒక కల లాంటిదే. రామానాయుడు ఫిలిం స్కూల్‌కి చెందిన సాయేష్ అనే కుర్రాడు ఈ కథ ఇచ్చి, అమెరికా వెళ్లిపోయాడు. అతణ్ణే డెరైక్షన్ చేయమంటే చేయనన్నాడు. దాంతో నేను చేశాను. క్యూట్ లవ్ స్టోరీతో సాగే పట్టణ నేపథ్యపు రొమాంటిక్ కామెడీ మూవీ ఇది. ‘గోల్కొండ హైస్కూల్’కి నాతో పని చేసిన సంతోష్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు’’ అని పి. రామ్మోహన్ అన్నారు.
‘వర్షం’ దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్, అవికా గోర్ జంటగా స్వీయదర్శకత్వంలో రామ్మోహన్ రూపొందించిన చిత్రం ‘తను - నేను’. డి. సురేశ్ బాబు సమర్పణలో సన్‌షైన్ సినిమా, వయాకామ్ 18 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ - ‘‘ ‘అష్టా చెమ్మా’ ద్వారా నానీని, ‘ఉయ్యాల జంపాల’ ద్వారా రాజ్ తరుణ్‌నీ హీరోలుగా పరిచయం చేశారు రామ్మోహన్. ఇప్పుడు పరిచయం చేస్తున్న సంతోశ్‌కి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రతిభకు పట్టం కడతామనడానికి ఇదొక ఉదాహరణ. ఇక్కడ ఎవరూ ఎవర్నీ నియంత్రించలేరు. పరిశ్రమను గుప్పిట్లో పెట్టుకుని కంట్రోల్ చేయడం అనేది ఉండదు. అందుకని ఫిర్యాదులు చేసేవాళ్లు ఇకనైనా ఆపితే మంచిది.
పాత రోజుల్లో ఓ కథ అనుకున్నాక, దాని గురించి చర్చించి పంపిణీదారుల నుంచి డబ్బులు తీసుకునేవాళ్లు నిర్మాతలు. నేనిప్పటికీ ఆ విధానాన్నే పాటిస్తున్నా. ప్రస్తుతం వ్యాపార సరళి మారుతున్న నేపథ్యంలో పాత పద్ధతే బాగుందనిపిస్తోంది. కానీ, మార్పుతో పాటు ముందుకెళితేనే పరిశ్రమలో నిలదొక్కుకుంటాం’’ అన్నారు. వయాకామ్ 18 పిక్చర్స్ అజిత్ అంధేర్ మాట్లాడుతూ, ‘‘ఆహ్లాదకరమైన ప్రేమకథ, కామెడీతో సాగే చిత్రమిది. అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేస్తున్నాం’’ అని చెప్పారు. సంతోష్ శోభన్, నాని, రాజ్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.