Tarun Raj
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘ప్రేమించుకుందాం రా’ హీరోయిన్
టాలీవుడ్లోకి ప్రతి ఏడాది పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు వస్తుంటారు. వారిలో కొందరు తొలి సినిమాతోనే విజయం సాధించి స్టార్ హీరోయిన్గా అవతరిస్తే.. మరికొందరు తొలి సినిమాతోనే కనుమరుగైపోతారు. ఇంకొంత మంది అయితే వరుస సినిమాలు చేస్తూ తమదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే సడన్‌గా వెండితెరకు దూరమవుతారు. అలాంటి వారిలో అంజలా ఝవేరి ఒకరు. ఈ పేరు అందరికి తెలియకపోవచ్చు కానీ.. ఆమె నటించిన సినిమాల పేర్లు చెబితే ఈజీగా గుర్తుపట్టేస్తారు. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘ప్రేమించుకుందాం రా’ చిత్రంలో పక్కింటి అమ్మాయి కావేరి పాత్రలో నటించిన బ్యూటీయే ఈ అంజలా ఝవేరి. ఇది ఆమె తొలి సినిమా. ఫస్ట్ సినిమాలోనే తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి రెండో సినిమా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం లభించింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన చిత్రం ‘చూడాలని ఉంది’. 1998లో విడుదలైన ఈ చిత్రంలో సౌందర్య మొదటి హీరోయిన్ కాగా.. అంజలా ఝవేరి సెకండ్ హీరోయిన్గా నటించింది. అది కూడా సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చాయి. 'రావోయి చందమామ', 'దేవీ పుత్రుడు', 'ప్రేమ సందడి' లాంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించి ముఖ్యంగా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ మూవీల్లో నటించిన ఈ భామ చాలా మంది అగ్రహీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇలా కెరీర్ పీక్ స్టేజిలో ఉండగానే బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరాని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. View this post on Instagram A post shared by Tarun Arora (@tarun_raj_arora) పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అంజలా ఝవేరి.. 2012లో చివరగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. మంచి పాత్రలు వస్తే మళ్లీ నటించేందుకు అంజలా ఝవేరి సిద్ధంగా ఉన్నట్లు ఆమె భర్త తరుణ్ అరోరా చెప్పారు. ప్రస్తుతం అతను తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో స్టైలిష్ విలన్‌గా రాణిస్తున్నాడు. -
లాజిక్కులు కనపడవు.. మేజిక్ ఉంటుంది
‘‘ఏడాది కిందట విన్న కథ ఇది. ఈ కథను ఎవరు చక్కగా తెరకెక్కించగలరు? అనే చర్చ వచ్చినప్పుడు అనీల్ సుంకరగారు వంశీకృష్ణను తీసుకొచ్చారు. అనూప్ రూబెన్స్ కు నేను పెద్ద ఫ్యాన్ ని. తనతో ఎప్పటి నుంచో పని చేయాలనుకుంటున్నా, ఇప్పటికి కుదిరింది. రాజశేఖర్‌గారు ప్రతి సీన్ ను చాలా రిచ్‌గా చూపించారు’’ అని హీరో రాజ్‌తరుణ్ అన్నారు. రాజ్‌తరుణ్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా ‘దొంగాట’ ఫేం వంశీకృష్ణ దర్శకత్వంలో ఏ టీవీ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ మార్చి 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గుమ్మడికాయ వేడుక నిర్వహించారు. వంశీకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఇది నా రెండో చిత్రం. ‘సినిమా చూపిస్త మావ’ చిత్రం చూసి రాజ్‌తరుణ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్‌తో చేయాలనుకున్నా. నా కోరిక చాలా త్వరగా తీరింది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో లాజిక్‌లు కనపడవు, కానీ మేజిక్ ఉంటుంది. ప్రతి సీన్ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తారు’’ అని నిర్మాత అనీల్ సుంకర చెప్పారు. అను ఇమ్మాన్యుయేల్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ , కొరియోగ్రాఫర్ రాజు సుందరం, మాటల ర చయిత సాయిమాధవ్ బుర్రా తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బి.రాజశేఖర్, సహ నిర్మాత: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి. -
తీపి... చేదు మిశ్రమాల ఉగాది
2012లో రిలీజైన పవన్ కల్యాణ్ ‘గబ్బర్‌సింగ్’ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అందుకే ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉగాదికి సందడి చేయడానికి ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తెర మీదకొచ్చాడు. సినిమా మొత్తం ఆటాపాటలతో సందడి సందడిగానే సాగింది. కానీ, పవన్ నుంచి ఇంకా భారీగా ఎక్స్పెక్ట్ చేశారు. ఆ భారీ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. దాంతో చేదు అనుభవమే మిగిలింది. దాదాపు 75 కోట్లతో తీసిన ఈ సినిమా సుమారు 50 కోట్లు రాబట్టగలిగింది. ఆ తర్వాత వారం గ్యాప్‌తో మంచు విష్ణు, రాజ్ తరుణ్ ‘ఈడో రకం ఆడో రకం’ రిలీజైంది. మంచి ఎంటర్టైనర్ అనిపించుకుని, ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్‌గా నిలబడింది. అనంతరం వారం రోజులకు అల్లు అర్జున్ ‘సరైనోడు’వచ్చాడు. టైటిల్‌కి తగ్గట్టే వసూళ్ల పరంగా ‘సరైనోడు’ అనిపించుకున్నాడు. సుమారు రూ.50 కోట్లతో తీసిన ఈ సినిమా రూ.90 కోట్ల్ల వరకూ వసూలు చేసింది. అల్లు అర్జున్ కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్ ఇది. -
కథ చెప్పమంటే లేదన్నాడు
‘‘యూట్యూబ్‌లో ‘అను కోకుండా’ అనే షార్ట్‌ఫిల్మ్ చూసి, తరుణ్‌కి కాల్ చేశా. వచ్చి కలిశాడు. ఓ ప్రేమకథ ఉంటే చెప్పమన్నాను. కథ లేదని చెప్పాడు. ఇప్పుడు ‘పెళ్లి చూపులు’తో దర్శకుడిగా మారి సక్సెస్ అందుకున్నాడు. తరుణ్‌తో సినిమా చేయాలని ఉంది’’ అన్నారు అఖిల్. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యష్ రంగినేని నిర్మించిన చిత్రం ‘పెళ్లిచూపులు’. ఆదివారం జరిగిన ఈ చిత్రం విజయోత్సవంలో అఖిల్ పాల్గొన్నారు. ‘‘గత పదేళ్లలో నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తై ఈ సినిమా మరో ఎత్తు’’ అని రాజ్ కందుకూరి అన్నారు. దర్శకులు నందినీరెడ్డి, నాగ్ అశ్విన్, హీరో రాజ్ తరుణ్, చిత్రనాయకా నాయికలు విజయ్ దేవరకొండ, రీతూవర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: డి.సురేశ్ బాబు. -
అందమైన సిత్రాలు!
సీతమ్మ చాలా అందంగా ఉంటుంది. రామయ్య కూడా అందగాడే. అతను చేసే సిత్రాలు భలే ముచ్చటగా ఉంటాయి. ఆ సిత్రాలకు సీతమ్మ ఎలా మురిసిపోయింది? రామయ్య చేసే సిత్రాలు ఎలా ఉంటాయి? అనే అంశాల సమాహారంతో రూపొందిన చిత్రం ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’. టైటిల్ రోల్స్‌లో రాజ్ తరుణ్, అర్తన నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్.బాబు సమర్పణలో ఎస్.ై శెలేంద్రబాబు, కేవీ శ్రీధర్‌రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి ఈ సినిమా నిర్మించారు. ‘‘పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిర్మించిన మా చిత్రాన్ని అన్ని వర్గాలవారు చూడొచ్చు’’ అని దర్శకుడు చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘సున్నితమైన భావోద్వేగాలకు పెద్ద పీట వేశాం. నవ్యమైన కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రంలో పతాక సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయి. డిసెంబరులో పాటల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. రణధీర్, రాజా రవీంద్ర, ఆదర్శ్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖా వాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విశ్వ, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్. -
చాలా మెచ్యూరిటీ అవసరం..!
కొత్త సినిమాలు గురూ! చిత్రం: కుమారి 21ఎఫ్; తారాగణం: రాజ్ తరుణ్, హేబా పటేల్, హేమ; మాటలు: పొట్లూరి వెంకటేశ్వరరావు; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కెమేరా: ఆర్. రత్నవేలు; యాక్షన్: డ్రాగన్ ప్రకాశ్; కథ, స్క్రీన్‌ప్లే, సమర్పణ: సుకుమార్; నిర్మాతలు: విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి; దర్శకత్వం: పల్నాటి సూర్యప్రతాప్; నిడివి: 133 నిమిషాలు ఒకమ్మాయి, ఒకబ్బాయిని చూసి ‘ఎంతకొస్తావ’ని అడగడం చిత్రమే! చూసీచూడగానే ప్రేమలో పడ్డ అబ్బాయికి ఫస్ట్ కిస్ ఇవ్వడం... అతను తనను చూడాలనుకుంటున్న రీతిలో చూపడం... కచ్చితంగా విచిత్రమే! ‘‘ఫీల్ మై లవ్’’ అంటూ... వన్‌సైడ్ లవ్ (‘ఆర్య’ గుర్తుందిగా) లాంటి విభిన్న తరహా న్యూ ఏజ్ లవ్‌స్టోరీలు అల్లే దర్శక- రచయిత బి. సుకుమార్ ఆలోచనలు ఎప్పుడూ ఇలానే ఉంటాయి. అలా ఆయన రాసుకొని, నిర్మాతగా వెండితెరకు అందించిన కథ - ‘కుమారి 21ఎఫ్’. టచ్ ఫోన్లో టైటిల్స్ వేయడం దగ్గర నుంచే రొటీన్ కథలకు విభిన్నమైన సినిమాగా ‘కుమారి 21ఎఫ్’ మొదలవుతుంది. కాలనీలో ఫ్రెండ్స్‌తో సరదాగా తిరిగే కుర్రాడు సిద్ధు (రాజ్‌తరుణ్). తల్లి నర్సు (హేమ). తండ్రి విడిపోయి, వేరొక చోట ఉంటాడు. చదివిన క్యాటరింగ్ చదువుతో సింగపూర్‌లో స్టార్ క్రూయిజ్‌లో షెఫ్‌గా చేరాలని హీరో లక్ష్యం. అతనికి శంకర్ (నోయెల్), సెల్‌ఫోన్ ఫోటో సురేశ్ (నవీన్), సొల్లు శీను (సుదర్శన్)లు ముగ్గురూ క్లోజ్ ఫ్రెండ్స్. ఏ.టి.ఎం.లలో దొంగతనాల లాంటివి చేస్తూ ఆ ముగ్గురూ బతికేస్తుంటారు. చిన్నా చితకా సినిమాల్లో చేసే మోడల్ కుమారి (హేబా పటేల్) ముంబయ్ నుంచి వాళ్ళ కాలనీలోకి ఎంటరవుతుంది. బోల్డ్‌గా మాట్లాడుతూ, బోళాగా ఉండే ఆ అమ్మాయి తొలిచూపులో హీరోను ప్రేమిస్తుంది. తొలిముద్దు తొలిప్రేమ అతనితోనే పంచుకున్నానంటుంది. కానీ, మోడళ్ళ జీవితం, హీరోయిన్ ప్రవర్తన గురించి నెగటివ్ కామెంట్స్‌తో హీరో మనసులో ఫ్రెండ్స్ అనుమాన బీజం నాటతారు. దాంతో, తీరా హీరో తన లవ్ చెప్పే టైమ్‌కి అతనికి మెచ్యూరిటీ లేదు పొమ్మంటుంది హీరోయిన్. అక్కడ నుంచి హీరోలో మానసిక ఘర్షణ. ఇక, ఈజీమనీకి అలవాటుపడ్డ హీరో ఫ్రెండ్స్ ఏ.టి.ఎం. లూఠీకి తెగబడతారు. అప్పుడేమైంది? హీరో ప్రేమ మాటేమిటన్నది మిగతా కథ. ‘సినిమా చూపిస్త మావ’ ఫేవ్‌ు రాజ్‌తరుణ్ అచ్చంగా సిద్ధూ పాత్రే అనిపిస్తారు. బ్యాక్‌గ్రౌండ్, బయోడేటా బదులు హైట్, వెయిట్, బాడీ కొలతలు చెప్పే మీనాకుమారి అలియాస్ కుమారిగా హేబా పటేల్ పొట్టి లాగూలు, స్కర్టులతో హుషారుగా కనిపిస్తారు. ఆమెకు తెలుగు డబ్బింగ్ (లిప్సిక) బాగా కుదిరింది. హీరో ఫ్రెండ్స్ పాత్రలు నవ్వించడానికి, అడల్ట్ కామెడీకి కథలో పనికొచ్చాయి. మ్యూజిక్ (దేవిశ్రీప్రసాద్), కెమేరా (రత్నవేలు) బాగున్నాయి. ఇక, సినిమాలోని బ్యాంకాక్ పాట, అలాగే ‘లవ్ చేయాలా... వద్దా’ పాటలోని సాహిత్యం నిజజీవితానికి అద్దం పట్టిన సమకాలీన భావవ్యక్తీకరణలు. ఈ ‘ఏ’ సర్టిఫికెట్ సినిమా పెద్దలు చూడాల్సినదే. పెద్దలు కావడానికి సిద్ధమవుతున్న టీనేజ్ ప్రేమికులూ చూసి, అర్థం చేసుకొని, ఆలోచించాల్సిన అంశాలూ దీనిలో ఉన్నాయి. ‘నేనెలాగైనా తిరగచ్చు కానీ, నేను జీవితం పంచుకొనేవాళ్ళు ఎన్నడూ, ఎవరితో తిరగని వాళ్ళయ్యుండాలి’ అనే పురుషస్వామ్య ఆలోచనకు ప్రతిబింబం హీరో పాత్ర. మరోపక్క, ఏ బంధానికైనా అమిత శత్రువు అనుమానం. దీన్ని తల్లి పాత్రలో ప్రస్తావిస్తారు. ఒక విధంగా చూస్తే - ఇలాంటి అంశాలను ధైర్యంగా తెరపై చర్చించడం సాహసమే. ఆ సాహసానికి ఒడికట్టి, నవతరం మాట్లాడుకొనే యాస, భాష వాడడంతో అనివార్యంగా సినిమాలో దాదాపు పాతిక దాకా కత్తెరలు పడ్డట్లున్నాయి. ఒక డైలాగ్ రైటర్, మరో ముగ్గురు అదనపు రచయితలు పనిచేసిన ఈ సినిమాలో మాటలు ‘మ్యూట్’ అయ్యాయి. బొమ్మలు ‘బ్లర్’ అయ్యాయి. లవ్ ఏజ్‌లో ఉండే టీనేజర్ల అంతరంగంలోని గందరగోళాల్ని పచ్చిగానే అయినా, బోరనిపించకుండా బోల్డ్‌గా చెప్పడం ఫస్టాఫ్‌లో కనిపిస్తుంది. సెకండాఫ్‌లో పాత్రలతో పాటు కథ కూడా గుంజాటనలో పడుతుంది. క్లైమాక్స్ ముందు నుంచి వేరొక రూపం తీసుకుంటుంది. లవ్‌స్టోరీ ఫీల్‌తో సాగే ఫిల్మ్ చివరకొచ్చేసరికి క్రైమ్‌కథగా ముగుస్తుంది. విడాకులతో హీరో తల్లీ తండ్రి 20 ఏళ్ళ క్రితం విడిపోయారన్న సంఘటన, తండ్రి ప్రవర్తన, ముగింపు లాంటివన్నీ సినిమాటిక్ స్క్రీన్‌ప్లే కన్వీనియన్సే. లోటుపాట్లెలా ఉన్నా, ఆలోచించాల్సినవీ, యూత్‌ను ఆకర్షించేవీ ఉన్న సినిమాగా ‘కుమారి 21ఎఫ్’ నిలుస్తుంది. ఆకర్షణ సరే కానీ, ఆలోచించే మెచ్యూరిటీ ప్రేమించే వాళ్ళతో పాటు, సినిమా తీసేవాళ్ళు, చూసేవాళ్ళకూ అవసరమే. అది ఎందరికుందన్నది ప్రశ్న. అంత మెచ్యూర్డ్ కుమారి పాత్రల్ని బాహా టంగా ఎవరు, ఏ మేరకు స్వాగతిస్తారన్నది వేచిచూడాల్సిన జవాబు. హైదరాబాద్‌లో మలక్‌పేట ఆర్ అండ్ బి క్వార్టర్సలో 60 శాతం ఫిల్మ్ తీశారు. ఒక్క పాట కోసం బ్యాంకాక్ వెళ్ళారు. 70 వర్కింగ్ డేస్. బడ్జెట్ 6 కోట్లు. దేవిశ్రీప్రసాద్, రత్నవేలు డబ్బు తీసుకో లేదు. సుకుమార్ పార్‌టనర్‌సగా చేశారు. ‘ఆర్య’ నుంచి సుకుమార్‌తో పని చేస్తూ ‘కరెంట్’తో డెరైక్టరైన సూర్య ప్రతాప్‌కి ఇది రెండో సినిమా. రెంటాల జయదేవ -
సునీల్ కోసం కథ రాశా!
‘‘సుకుమార్ ితీసే చిత్రాలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అందుకే ఆయన ఈ కథ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నా’’ అని హీరో రాజ్ తరుణ్ అన్నారు. సుకుమార్ నిర్మాతగా మారి స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన చిత్రం ‘కుమారి 21 ఎఫ్’. సూర్యప్రతాప్ దర్శకత్వంలో విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల వచ్చిన అనేక వార్తలపై రాజ్ తరుణ్ స్పందన... నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ‘కుమారి 21ఎఫ్’ ఉంటుంది. ఈ సినిమా మొత్తం కుమారి అనే అమ్మాయి చుట్టూ తిరిగినా, నా పాత్ర చాలా కీలకం. మా ఇద్దరి పాత్రలకు సమ ప్రాధాన్యం ఉంటుంది. నా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉండవు. హీరో తన మనసులో భావాలను వ్యక్తం చేసే తీరు కొత్తగా ఉంటుంది. దేవిశ్రీప్రసాద్, రత్నవేలు లాంటి టెక్నీషియన్లతో పనిచేయాలన్న కల ఈ సినిమాతో తీరింది. హీరో సునీల్ నాకు మంచి ఫ్రెండ్. అప్పుడప్పుడూ ఆయనను కలుస్తుంటాను. అప్పుడు తన కోసం ఓ కథ సిద్ధం చేయమన్నారు. సరదాగా కథ రాశాను గానీ దాన్ని తెరకెక్కించాలనే ఆలోచన లేదు. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఆలోచించను. ఖాళీ దొరికినప్పుడల్లా కథలు రాసుకుంటుంటాను. మనం కలిసి సినిమా చేద్దామని రామ్గోపాల్వర్మగారే అన్నారు. ఇంకా కథ సిద్ధం కాలేదు. వర్మగారే నా ఫోన్ తీసుకుని నా ట్విట్టర్ ద్వారా ఆయనపై ఆయనే కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన నా అభిమాన దర్శకుడైన ఆయనను నేనెందుకు విమర్శిస్తాను! వంశీగారి దర్శకత్వంలో ‘లేడీస్ టైలర్’ సీక్వెల్లో నటించనున్నా. కథ వైవిధ్యంగా ఉంటుంది. దీనికి ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’తో పాటు మరికొన్ని టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మంచు విష్ణుతో కలిసి ఓ పంజాబీ రీమేక్‌లో, మారుతీ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌లో మరో సినిమా చేయనున్నాను. పారితోషికం పెంచానన్న వార్తల్లో నిజం లేదు. (నవ్వుతూ) అయితే, నాకూ పెంచాలనే ఉంది. ‘కుమారి 21ఎఫ్’, ‘సినిమా చూపిస్త మావ’ వగైరా ఒకేసారి ఒప్పుకున్నా. అందుకే పెంచడానికి వీలు కాలేదు. -
ఇక్కడ ఎవరూ ఎవర్నీ నియంత్రించలేరు!
‘‘నేను 1996లో పరిశ్రమకు వచ్చాను. అప్పట్నుంచీ సురేశ్‌బాబుతో స్నేహం ఉంది. సురేశ్ ప్రొడక్షన్స్‌లో వర్క్ చేశాను. ఈ బేనర్లో ైడెరైక్షన్ చేయడం అనేది ఒక కల లాంటిదే. రామానాయుడు ఫిలిం స్కూల్‌కి చెందిన సాయేష్ అనే కుర్రాడు ఈ కథ ఇచ్చి, అమెరికా వెళ్లిపోయాడు. అతణ్ణే డెరైక్షన్ చేయమంటే చేయనన్నాడు. దాంతో నేను చేశాను. క్యూట్ లవ్ స్టోరీతో సాగే పట్టణ నేపథ్యపు రొమాంటిక్ కామెడీ మూవీ ఇది. ‘గోల్కొండ హైస్కూల్’కి నాతో పని చేసిన సంతోష్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు’’ అని పి. రామ్మోహన్ అన్నారు. ‘వర్షం’ దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్, అవికా గోర్ జంటగా స్వీయదర్శకత్వంలో రామ్మోహన్ రూపొందించిన చిత్రం ‘తను - నేను’. డి. సురేశ్ బాబు సమర్పణలో సన్‌షైన్ సినిమా, వయాకామ్ 18 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ - ‘‘ ‘అష్టా చెమ్మా’ ద్వారా నానీని, ‘ఉయ్యాల జంపాల’ ద్వారా రాజ్ తరుణ్నీ హీరోలుగా పరిచయం చేశారు రామ్మోహన్. ఇప్పుడు పరిచయం చేస్తున్న సంతోశ్‌కి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రతిభకు పట్టం కడతామనడానికి ఇదొక ఉదాహరణ. ఇక్కడ ఎవరూ ఎవర్నీ నియంత్రించలేరు. పరిశ్రమను గుప్పిట్లో పెట్టుకుని కంట్రోల్ చేయడం అనేది ఉండదు. అందుకని ఫిర్యాదులు చేసేవాళ్లు ఇకనైనా ఆపితే మంచిది. పాత రోజుల్లో ఓ కథ అనుకున్నాక, దాని గురించి చర్చించి పంపిణీదారుల నుంచి డబ్బులు తీసుకునేవాళ్లు నిర్మాతలు. నేనిప్పటికీ ఆ విధానాన్నే పాటిస్తున్నా. ప్రస్తుతం వ్యాపార సరళి మారుతున్న నేపథ్యంలో పాత పద్ధతే బాగుందనిపిస్తోంది. కానీ, మార్పుతో పాటు ముందుకెళితేనే పరిశ్రమలో నిలదొక్కుకుంటాం’’ అన్నారు. వయాకామ్ 18 పిక్చర్స్ అజిత్ అంధేర్ మాట్లాడుతూ, ‘‘ఆహ్లాదకరమైన ప్రేమకథ, కామెడీతో సాగే చిత్రమిది. అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేస్తున్నాం’’ అని చెప్పారు. సంతోష్ శోభన్, నాని, రాజ్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నా... - హీరో రాజ్‌తరుణ్
70 ఎంఎం సెల్యులాయిడ్‌పై మనల్ని మనం చూసుకుంటే ఎంత బావుంటుందోనని కలలు కనే యూత్ మన చుట్టూ లక్షల మంది ఉన్నారు. దానిని నిజం చేసుకోవడానికి కష్టపడుతున్న వారు కూడా వేలల్లో ఉన్నారు. సినీ వారసులు రాజ్యమేలుతున్న సమయంలో అవకాశాల కోసం ఏళ్లతరబడి ఫిల్మ్ నగర్ చుట్టూ తిరుతున్నారు. కానీ ఈ కుర్రాడు కాస్త డిఫరెంట్. షార్ట్ ఫిల్మ్‌లతో టాలెంట్ చూపించి అసిస్టెంట్ డైరక్టర్‌గా చేరి, ఆడిషన్స్‌లో చాన్స్‌ల కోసం వచ్చిన వారికి ఇలా నటించాలి...అలా నటించాలి... అని చూపిస్తూ దర్శకుడి కంట్లో పడ్డాడు. హీరోగా మారాడు. సినిమా పేరు ‘ఉయ్యాల జంపాల’. హీరోకు కావలసిన లక్షణాలు ఏమీ లేని బక్క పలచని కుర్రాడు ఎనర్జీతో ‘సినిమా చూపిస్త మామా’ అని ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్నాడు. అతనే వైజాగ్ కుర్రాడు రాజ్ తరుణ్. ఆ చిత్రం సక్సెస్ మీట్ సందర్భంగా వైజాగ్ వచ్చిన సందర్భంగా సాక్షితో ముచ్చటించాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే... - పెదగంట్యాడ నేను వైజాగ్ లోకల్... నేను పుట్టింది పెరిగింది అంతా వైజాగ్‌లోనే, మా అమ్మ నాన్న ఇప్పుడు కూడా ఇక్కడే ఉంటున్నారు. మేం సింహాచలం దగ్గర ప్రహ్లాదపురంలో ఉంటాం. మా నాన్న బ్యాంక్ ఎంప్లాయి, అమ్మ హౌస్ వైఫ్. సినిమా అంటే పిచ్చి... నాకు సినిమా అంటే ఎంతో ఇష్టం. సొంతంగా సినిమా తియ్యాలని చిన్న చిన్న స్ట్క్రిప్ట్లు రాసుకుంటూ ఉండేవాడిని. 8వ తరగతితో ఉన్నప్పుడు మా యింట్లో ఉన్న చిన్న హ్యాండీ క్యామ్‌తో నేనే నటించి వీడియో చేశాను. ఎడిటింగ్ మ్యూజిక్ అన్నీ చేసి మా అన్నకు, నాన్నకు చూపించాను. వాళ్లకది బాగా నచ్చింది. డీవీడీ పెట్టుకునే చిన్న హ్యాండీ క్యామ్ కొనిచ్చారు. తర్వాత రెండు మూడు షార్ట్ ఫిల్మ్‌లు తీశాను. కాలేజ్‌లో సుభాష్(ఎమ్ఆర్ ప్రొడక్షన్ పేరుతో స్టూడెంట్స్‌తో షార్ట్ ఫిల్మ్‌లు చేశాడు) పరిచయం అయ్యాడు. తర్వాత వంద షార్ట్ ఫిల్మ్‌ల వరకూ చేశాం. అంత ఈజీకాదు... చిన్న క్యామ్, ఖాళీ రూమ్, ఫ్రెండ్స్ ఉంటే షార్ట్ ఫిల్మ్ అయిపోతుంది. కానీ స్క్రిప్ట్ నుండి ప్రొడక్షన్ వరకూ వందల మందిని మేనేజ్ చేసి సినిమా తియ్యాలంటే అంత ఈజీ కాదు. షార్ట్ ఫిల్మ్‌లకు ఒక్క లాజిక్ ఉంటే కంప్లీట్ అవుతుంది. పెద్ద సినిమా సీన్ బై సీన్ లాజిక్ మిస్ అవ్వకుండా కంటిన్యూగా రెండున్నర గంటలు ప్రేక్షకుడిని భ్రమలో ఉంచాలి. లేదంటే ఎంత కష్టపడి సినిమా తీసినా చెత్త సినిమా అని ఒక్క మాటలో కొట్టి పారేస్తారు. ఊహించలేదు... ‘సినిమా చూపిస్త మావ’ సక్సెస్ మీట్ కోసం గాజువాక వచ్చాను. అప్పుడు అంత మంది జనం ఉంటారని ఊహించలేదు. కనీసం నేను నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాను. ఒకడు చెయ్యి, ఇంకొకరు కాలు, మరొకరు జుట్టు పట్టుకుని లాగుతుంటే ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అయినా దీని కోసమే కదా ఇంత కష్టపడింది అని ఆనందంగా ఫీలయ్యా. ఒక విజయం సాధించగానే గర్వం తలకెక్కకూడదు. అది అదృష్టం మాత్రమే. నేను చేసింది చాలా తక్కువ అని బలంగా నమ్ముతాను. అందుకే అందరినీ గౌరవించి ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను. టిక్కెట్ల కోసం గొడవ చేసే వాడిని ‘ఒక్కడు’ సినిమా చూశాకే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. గోపాలపట్నం సుకన్య థియేటర్లో ఎక్కువ సినిమాలు చూసేవాడిని. ఎప్పుడూ టికెట్ల కోసం హాల్లో ఒక వ్యక్తితో వాదన చేస్తూ ఉండేవాడిని. అతను ఇక్కడి నుంచి పొమ్మని అరిచేవాడు. ఇప్పుడు సక్సెస్ టూర్లో ఆ థియేటర్‌కు వెళ్లి ఎప్పుడూ పొమ్మనేవారు, ఇప్పుడేంటి కొత్తగా రండి, రండీ అని గౌరవిస్తున్నారు.. అని చమత్కారంగా అడిగాను ఆరోజులు మళ్లీ వస్తాయా చెప్పండి... తర్వాతి సినిమా... : డైరక్టర్ సుకుమార్ ప్రొడక్షన్లో 21ఎఫ్ అనే షూట్ జరుగుతోంది. కెమెరామెన్ రత్నవేలు, మ్యూజిక్ డెరైక్టర్ దేవీశ్రీ ప్రసాద్, సుకుమార్ గారు వీళ్లంతా నా ఫేవరెట్ టీమ్. ఎప్పటికైనా వీళ్లతో పని చెయ్యాలని కలలు కనేవాడిని. ఇంత తొందరగా ఈ అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. అనుకోకుండా చాన్స్... ఉయ్యాల జంపాల సినిమాకి అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చెయ్యడానికి వెళ్లాను. రెండు వందల మందిని ఆడిషన్స్‌లో చూసినా ఎవరికీ నచ్చలేదు. ఆఖరికి డైరక్టర్ సీన్ పేపర్ నాకిచ్చి చెయ్యమని అడిగారు. నేను అలవాటు ఉండడం వల్ల సింపుల్‌గా చేసి చూపించా. వాళ్లకది నచ్చింది..నాకు చాన్సొచ్చింది. -
సుకుమారి 21... లవ్‌స్టోరీ
స్టార్ డెరైక్టర్ సుకుమార్ తొలిసారి కథ, స్క్రీన్‌ప్లే అందించి, తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రం ‘కుమారి 21 ఎఫ్’. రాజ్‌తరుణ్, హేభా పటేల్ జంటగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సుకుమార్ మాట్లాడుతూ- ‘‘ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం. యూత్‌తో పాటు అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే అంశాలుంటాయి. రత్నవేలు ఫొటోగ్రపీ, దేవిశ్రీ ప్రసాద్‌ల సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు. ‘‘సుకుమార్ మార్క్‌లో సాగే అందమైన ప్రేమకథ ఇది. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. అక్టోబర్‌లో పాటలను, అదే నెల 30న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్: అమర్‌రెడ్డి, ఆర్ట్: బి.రామచంద్రసింగ్. -
రాజ్‌తరుణ్ హుషారు ప్రేమ
‘సినిమా చూపిస్త మావ’ అంటూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన రాజ్‌తరుణ్ ఇప్పుడు తన తాజా చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు, శ్రీధర్‌రెడ్డి కేవి, హరీష్.డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్తన కథానాయిక. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలో రాజ్‌తరుణ్ ఈ తరానికి ప్రతినిధిలా కనిపిస్తాడు. ఆయన పాత్ర చాలా హుషారుగా ఉంటుంది. ప్రస్తుతం రాజ్‌తరుణ్, ఆర్తనలపై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, ఛాయాగ్రహణం: విశ్వ, సమర్పణ: శ్రీమతి పూర్ణిమ, ఎస్.బాబు -
సినిమా చూపిస్తాడు!
అటు ప్రేమను, ఇటు మామను సాధించుకున్న ఓ అల్లరి కుర్రాడి కథే ‘సినిమా చూపిస్త మావ’. రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా, రావు రమేశ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు. బోగాది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, రూపేశ్ డి. సాహిల్, జి.సునీత నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. బెక్కెం గోపి మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా చూసి ‘దిల్’ రాజుగారు నైజాంలో విడుదల చేస్తున్నారు. దాంతో మా సినిమాపై ఇంకా నమ్మకం పెరిగింది’’ అన్నారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాలో నాకు, అవికా గోర్‌కు మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఓ మంచి ప్రేమకథకు మాస్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు దర్శకుడు’’ అని తెలిపారు. -
సినిమా చూపిస్తారట!
ఆ మధ్య విడుదలైన ‘రేసు గుర్రం’లో ‘సినిమా చూపిస్త మావా..’ పాట ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. ఇప్పుడదే పదాలను టైటిల్‌గా చేసుకుని బోగాది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, రూపేష్ డి.గోవిల్, జి. సునీత నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ హీరో. నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముహూర్తపు దృశ్యానికి హీరో ‘అల్లరి’ నరేశ్ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత డి. సురేశ్‌బాబు క్లాప్ ఇచ్చారు. దర్శకులు భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘వినోద ప్రధానంగా సాగే చిత్రం ఇది. ఇందులో మావగారి పాత్రను సాయికుమార్, బావమరుదుల పాత్రలను సంపూర్ణేష్‌బాబు, సప్తగిరి చేస్తున్నారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: అంజిరెడ్డి ప్రొడక్షన్స్, ఆర్.డి.జి. ప్రొడక్షన్స్.