లాజిక్కులు కనపడవు.. మేజిక్ ఉంటుంది
‘‘ఏడాది కిందట విన్న కథ ఇది. ఈ కథను ఎవరు చక్కగా తెరకెక్కించగలరు? అనే చర్చ వచ్చినప్పుడు అనీల్ సుంకరగారు వంశీకృష్ణను తీసుకొచ్చారు. అనూప్ రూబెన్స్ కు నేను పెద్ద ఫ్యాన్ ని. తనతో ఎప్పటి నుంచో పని చేయాలనుకుంటున్నా, ఇప్పటికి కుదిరింది. రాజశేఖర్‌గారు ప్రతి సీన్ ను చాలా రిచ్‌గా చూపించారు’’ అని హీరో రాజ్‌తరుణ్ అన్నారు.
రాజ్‌తరుణ్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా ‘దొంగాట’ ఫేం వంశీకృష్ణ దర్శకత్వంలో ఏ టీవీ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ మార్చి 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గుమ్మడికాయ వేడుక నిర్వహించారు. వంశీకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఇది నా రెండో చిత్రం. ‘సినిమా చూపిస్త మావ’ చిత్రం చూసి రాజ్‌తరుణ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్‌తో చేయాలనుకున్నా. నా కోరిక చాలా త్వరగా తీరింది’’ అన్నారు.
‘‘ఈ సినిమాలో లాజిక్‌లు కనపడవు, కానీ మేజిక్ ఉంటుంది. ప్రతి సీన్ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తారు’’ అని నిర్మాత అనీల్ సుంకర చెప్పారు. అను ఇమ్మాన్యుయేల్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ , కొరియోగ్రాఫర్ రాజు సుందరం, మాటల ర చయిత సాయిమాధవ్ బుర్రా తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బి.రాజశేఖర్, సహ నిర్మాత: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి.