సునీల్ కోసం కథ రాశా!
‘‘సుకుమార్ ితీసే చిత్రాలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అందుకే ఆయన ఈ కథ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నా’’ అని హీరో రాజ్ తరుణ్ అన్నారు. సుకుమార్ నిర్మాతగా మారి స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన చిత్రం ‘కుమారి 21 ఎఫ్’. సూర్యప్రతాప్ దర్శకత్వంలో విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల వచ్చిన అనేక వార్తలపై రాజ్ తరుణ్ స్పందన...
నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ‘కుమారి 21ఎఫ్’ ఉంటుంది. ఈ సినిమా మొత్తం కుమారి అనే అమ్మాయి చుట్టూ తిరిగినా, నా పాత్ర చాలా కీలకం. మా ఇద్దరి పాత్రలకు సమ ప్రాధాన్యం ఉంటుంది. నా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉండవు. హీరో తన మనసులో భావాలను వ్యక్తం చేసే తీరు కొత్తగా ఉంటుంది. దేవిశ్రీప్రసాద్, రత్నవేలు లాంటి టెక్నీషియన్లతో పనిచేయాలన్న కల ఈ సినిమాతో తీరింది.
హీరో సునీల్ నాకు మంచి ఫ్రెండ్. అప్పుడప్పుడూ ఆయనను కలుస్తుంటాను. అప్పుడు తన కోసం ఓ కథ సిద్ధం చేయమన్నారు. సరదాగా కథ రాశాను గానీ దాన్ని తెరకెక్కించాలనే ఆలోచన లేదు. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఆలోచించను. ఖాళీ దొరికినప్పుడల్లా కథలు రాసుకుంటుంటాను.
మనం కలిసి సినిమా చేద్దామని రామ్‌గోపాల్‌వర్మగారే అన్నారు. ఇంకా కథ సిద్ధం కాలేదు. వర్మగారే నా ఫోన్ తీసుకుని నా ట్విట్టర్ ద్వారా ఆయనపై ఆయనే కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన నా అభిమాన దర్శకుడైన ఆయనను నేనెందుకు విమర్శిస్తాను!
వంశీగారి దర్శకత్వంలో ‘లేడీస్ టైలర్’ సీక్వెల్‌లో నటించనున్నా. కథ వైవిధ్యంగా ఉంటుంది. దీనికి ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’తో పాటు మరికొన్ని టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మంచు విష్ణుతో కలిసి ఓ పంజాబీ రీమేక్‌లో, మారుతీ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌లో మరో సినిమా చేయనున్నాను.
పారితోషికం పెంచానన్న వార్తల్లో నిజం లేదు. (నవ్వుతూ) అయితే, నాకూ పెంచాలనే ఉంది. ‘కుమారి 21ఎఫ్’, ‘సినిమా చూపిస్త మావ’ వగైరా ఒకేసారి ఒప్పుకున్నా. అందుకే పెంచడానికి వీలు కాలేదు.