సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నా... - హీరో రాజ్‌తరుణ్ | njoy success - hero of the rajtarun | Sakshi
Sakshi News home page

సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నా... - హీరో రాజ్‌తరుణ్

Published Tue, Oct 27 2015 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నా... - హీరో రాజ్‌తరుణ్

సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నా... - హీరో రాజ్‌తరుణ్

70 ఎంఎం సెల్యులాయిడ్‌పై మనల్ని మనం చూసుకుంటే ఎంత బావుంటుందోనని కలలు కనే యూత్ మన చుట్టూ లక్షల మంది ఉన్నారు. దానిని నిజం చేసుకోవడానికి  కష్టపడుతున్న వారు కూడా వేలల్లో ఉన్నారు. సినీ వారసులు రాజ్యమేలుతున్న సమయంలో అవకాశాల కోసం ఏళ్లతరబడి ఫిల్మ్ నగర్ చుట్టూ తిరుతున్నారు. కానీ ఈ కుర్రాడు కాస్త డిఫరెంట్. షార్ట్ ఫిల్మ్‌లతో టాలెంట్ చూపించి అసిస్టెంట్ డైరక్టర్‌గా చేరి, ఆడిషన్స్‌లో చాన్స్‌ల కోసం వచ్చిన వారికి ఇలా నటించాలి...అలా నటించాలి... అని చూపిస్తూ దర్శకుడి కంట్లో పడ్డాడు. హీరోగా మారాడు. సినిమా పేరు ‘ఉయ్యాల జంపాల’. హీరోకు కావలసిన లక్షణాలు ఏమీ లేని బక్క పలచని కుర్రాడు ఎనర్జీతో ‘సినిమా చూపిస్త మామా’ అని ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్నాడు. అతనే వైజాగ్ కుర్రాడు రాజ్ తరుణ్. ఆ చిత్రం సక్సెస్ మీట్ సందర్భంగా వైజాగ్ వచ్చిన సందర్భంగా సాక్షితో ముచ్చటించాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే...
 - పెదగంట్యాడ
 
నేను వైజాగ్ లోకల్...
నేను పుట్టింది పెరిగింది అంతా వైజాగ్‌లోనే, మా అమ్మ నాన్న ఇప్పుడు కూడా ఇక్కడే ఉంటున్నారు. మేం సింహాచలం దగ్గర  ప్రహ్లాదపురంలో ఉంటాం. మా నాన్న బ్యాంక్ ఎంప్లాయి, అమ్మ హౌస్ వైఫ్.
 
సినిమా అంటే పిచ్చి...

 నాకు సినిమా అంటే ఎంతో ఇష్టం. సొంతంగా సినిమా తియ్యాలని చిన్న చిన్న స్ట్క్రిప్ట్‌లు రాసుకుంటూ ఉండేవాడిని. 8వ తరగతితో ఉన్నప్పుడు మా యింట్లో ఉన్న చిన్న హ్యాండీ క్యామ్‌తో నేనే నటించి వీడియో చేశాను. ఎడిటింగ్ మ్యూజిక్ అన్నీ చేసి మా అన్నకు, నాన్నకు చూపించాను. వాళ్లకది బాగా నచ్చింది. డీవీడీ పెట్టుకునే చిన్న  హ్యాండీ క్యామ్ కొనిచ్చారు. తర్వాత రెండు మూడు షార్ట్ ఫిల్మ్‌లు తీశాను. కాలేజ్‌లో సుభాష్(ఎమ్‌ఆర్ ప్రొడక్షన్ పేరుతో స్టూడెంట్స్‌తో షార్ట్ ఫిల్మ్‌లు చేశాడు) పరిచయం అయ్యాడు. తర్వాత వంద షార్ట్ ఫిల్మ్‌ల వరకూ చేశాం.
 
అంత ఈజీకాదు...
చిన్న క్యామ్, ఖాళీ రూమ్, ఫ్రెండ్స్ ఉంటే షార్ట్ ఫిల్మ్ అయిపోతుంది. కానీ స్క్రిప్ట్ నుండి ప్రొడక్షన్ వరకూ వందల మందిని మేనేజ్ చేసి సినిమా తియ్యాలంటే అంత ఈజీ కాదు. షార్ట్ ఫిల్మ్‌లకు ఒక్క లాజిక్ ఉంటే కంప్లీట్ అవుతుంది. పెద్ద సినిమా సీన్ బై సీన్ లాజిక్ మిస్ అవ్వకుండా కంటిన్యూగా రెండున్నర గంటలు ప్రేక్షకుడిని భ్రమలో ఉంచాలి. లేదంటే  ఎంత కష్టపడి సినిమా తీసినా చెత్త సినిమా అని ఒక్క మాటలో కొట్టి పారేస్తారు.

ఊహించలేదు...
‘సినిమా చూపిస్త మావ’ సక్సెస్ మీట్ కోసం గాజువాక వచ్చాను. అప్పుడు అంత మంది జనం ఉంటారని ఊహించలేదు. కనీసం నేను నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాను. ఒకడు చెయ్యి, ఇంకొకరు కాలు, మరొకరు జుట్టు పట్టుకుని లాగుతుంటే ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అయినా దీని కోసమే కదా ఇంత కష్టపడింది అని ఆనందంగా ఫీలయ్యా. ఒక విజయం సాధించగానే గర్వం తలకెక్కకూడదు. అది అదృష్టం మాత్రమే. నేను చేసింది చాలా తక్కువ అని బలంగా నమ్ముతాను. అందుకే అందరినీ గౌరవించి ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను.

టిక్కెట్ల కోసం గొడవ చేసే వాడిని
‘ఒక్కడు’ సినిమా చూశాకే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. గోపాలపట్నం సుకన్య థియేటర్‌లో ఎక్కువ సినిమాలు చూసేవాడిని. ఎప్పుడూ టికెట్ల కోసం హాల్‌లో ఒక వ్యక్తితో వాదన చేస్తూ ఉండేవాడిని. అతను ఇక్కడి నుంచి పొమ్మని అరిచేవాడు. ఇప్పుడు సక్సెస్ టూర్‌లో ఆ థియేటర్‌కు వెళ్లి ఎప్పుడూ పొమ్మనేవారు, ఇప్పుడేంటి కొత్తగా రండి, రండీ అని గౌరవిస్తున్నారు.. అని చమత్కారంగా అడిగాను ఆరోజులు మళ్లీ వస్తాయా చెప్పండి...

తర్వాతి సినిమా... : డైరక్టర్ సుకుమార్ ప్రొడక్షన్‌లో 21ఎఫ్ అనే షూట్ జరుగుతోంది. కెమెరామెన్ రత్నవేలు, మ్యూజిక్ డెరైక్టర్ దేవీశ్రీ ప్రసాద్, సుకుమార్ గారు వీళ్లంతా నా ఫేవరెట్ టీమ్. ఎప్పటికైనా వీళ్లతో పని చెయ్యాలని కలలు కనేవాడిని. ఇంత తొందరగా ఈ అవకాశం వస్తుందని నేను అనుకోలేదు.
 
అనుకోకుండా చాన్స్...
ఉయ్యాల జంపాల సినిమాకి అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చెయ్యడానికి వెళ్లాను. రెండు వందల మందిని ఆడిషన్స్‌లో చూసినా ఎవరికీ నచ్చలేదు. ఆఖరికి డైరక్టర్ సీన్ పేపర్ నాకిచ్చి చెయ్యమని అడిగారు. నేను అలవాటు ఉండడం వల్ల సింపుల్‌గా చేసి చూపించా. వాళ్లకది నచ్చింది..నాకు చాన్సొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement