న్యూస్‌లో వచ్చింది కానీ నన్నెవరూ అడుగలేదు!
ముంబై: రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడా బృందానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండేందుకు తన పేరును కూడా పరిశీలిస్తున్నారని వస్తున్న కథనాలపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్పందించారు. ఈ విషయంలో తనను ఎవరూ సంప్రందించలేదని ఆయన స్పష్టం చేశారు.
'మీడియాలో వచ్చినట్టు నాకు తెలిసింది. మీడియా అంతటా ఇవే కథనాలు ఉన్నాయి. గూగుల్ న్యూస్‌లోనూ ఇదే ఉంది. కానీ నన్నెవరూ సంప్రదించలేదు. నాకు ఎలాంటి ఈమెయిల్ రాలేదు. బహుశా నా మేనేజ్‌మెంట్‌కు ఈ విషయాన్ని చెప్పి ఉంటారేమో' అంటూ రెహ్మాన్ మంగళవారం ముంబైలో విలేకరులతో అన్నారు. తాను సంగీతం అందిస్తున్న హాలీవుడ్ సినిమా 'పీలే' ఆడియో విడుదల సందర్భంగా ఆయన విలేకరులతో ముచ్చటించారు.
రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడాబృందానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను నియమించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నియామకాన్ని మిల్ఖాసింగ్, యోగేశ్వర్ దత్ వంటి క్రీడాకారులు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో పీటీ ఉషా, ఏఆర్ రెహ్మాన్ వంటి ప్రముఖుల్ని కూడా గుడ్‌విల్ అంబాసిడర్లుగా భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఏవోఏ) నియమించవచ్చునని కథనాలు వచ్చాయి. కాగా, గుడ్‌విల్ అంబాసిడర్‌గా సల్మాన్ నియామకాన్ని రెహ్మాన్ స్వాగతించారు.