![ఆ ఆశ లేదు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/1/41375557997_625x300.jpg.webp?itok=5q5z0QWQ)
ఆ ఆశ లేదు
ఏ నటి అయినా నెంబర్‌వన్ హీరోయిన్ కావాలని కోరుకుంటుంది. కాజల్ అగర్వాల్ మాత్రం తనకలాంటి ఆశ లేదంటోంది. ప్రస్తుతం కోలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది ఈ బ్యూటీ. విజయ్ సరసన జిల్లా, కార్తీక్‌కు జంటగా ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా చిత్రాల్లో నటిస్తోంది. ఆల్ ఇన్ ఆల్ అళగురాజా దీపావళికి తెరపైకి రానుంది. కాజల్ అగర్వాల్ నెంబర్‌వన్ స్థానం కోసం ప్రయత్నిస్తోందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమె స్పందిస్తూ తాను ఇంతక ముందు కార్తీ సరసన నాన్ మహాన్ అల్ల చిత్రంలో నటించానని గుర్తు చేసింది. మళ్లీ ఇప్పుడు ఆయనతో ఆల్ ఇన్ ఆల్ అళగురాజా చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని పేర్కొంది.
ఇందులో తాను చలాకీ అమ్మాయిగా అభిమానులు మెచ్చే పాత్రలో వస్తున్నట్లు చెప్పింది. జిల్లా చిత్రంలో మదురై యువతిగా కనిపించనున్నట్లు తెలిపింది. నటనకు ప్రాముఖ్యం ఉన్న పాత్రలు ఇంతకముందు వచ్చినా కాల్ షీట్స్ సమస్య కారణంగా అంగీకరించేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపై అలాంటి పాత్రలు వస్తే వదులుకోనని స్పష్టం చేసింది. షూటింగ్ సెట్‌లో అందరితో సరదాగా మాట్లాడుతూ కలుపుగోలుగా ఉంటానంది.
తాను నెంబర్‌వన్ స్థానం కోసం తాపత్రయ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొంది. నిజానికి అలాంటి ఆశే లేదని స్పష్టం చేసింది. కమలహాసన్ సరసన నటించే అవకాశాన్ని తిరస్కరించినట్లు జరుగుతున్న ప్రచారంలోనూ వాస్తవం లేదని చెప్పింది. హిందీలో అవకాశాలు వస్తున్నాయని, అయితే ప్రస్తుతం తాను దక్షిణాది చిత్రాలతో చాలా సంతృప్తిగా ఉన్నానని వివరించింది.