రీమేక్ మీద మనసుపడ్డ ఎన్టీఆర్..!
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమా పనుల్లో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ తరువాత చేయబోయే సినిమాను ఇంత వరకు ప్రకటించలేదు. సినిమాతో పాటు తొలిసారిగా బుల్లితెర ఎంట్రీ ఇస్తూ బిగ్ బాస్ షో కూడా చేస్తున్నాడు జూనియర్. ఈ రెండు ప్రాజెక్ట్ ల తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏంటీ అన్న చర్చ మొదలైంది. స్టార్ డైరెక్టర్లు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నారు. జూనియర్ మాత్రం ఇంత వరకు ఏ ప్రాజెక్ట్ ను కన్ఫామ్ చేయలేదు.
రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి టాప్ డైరెక్టర్స్ తో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది. కన్నడలో సూపర్ హిట్ అయిన రాజ కుమార సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు ఎన్టీఆర్. ఇటీవల విడుదలైన ఈ సినిమా సాండల్ వుడ్ లో ఘనవిజయం సాధించింది.
ఎన్టీఆర్ స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన రాజ కుమార అక్కడ అత్యథిక సెంటర్లలో శతదినోత్సవం జరుపుకున్న సినిమాగా రికార్డ్ సృష్టించింది. పునీత్ స్వయంగా రాజ కుమార రీమేక్ గురించి ఎన్టీఆర్ తో చర్చించాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. రాజ కుమార రీమేక్ పై ఎన్టీఆర్ గట్టిగానే ఆలోచిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది.