తమిళ సినిమాకు ఓకే!
సినిమా తారలెవరైనా సరే విరామం లేకుండా వెండితెరపై కనిపిస్తేనే క్రేజ్ ఉంటుంది. రెండు మూడేళ్లు... ఆ పై విరామం తీసుకుంటే ప్రేక్షకులు దాదాపు మర్చిపోతారు. కానీ, కొంతమంది తారలకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. వాళ్లు సినిమాలు చేసినా చేయకపోయినా అభిమానులు ఆరాధిస్తూనే ఉంటారు. అలాంటి అరుదైన అభిమానాన్ని సొంతం చేసుకున్న తారల్లో శ్రీదేవికి ప్రముఖ స్థానమే ఉంటుంది. బోనీకపూర్‌ని పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలకు తల్లయిన తర్వాత దాదాపు పదిహేనేళ్లు శ్రీదేవి సినిమాల్లో నటించలేదు. అయినా అభిమానులు ఆమెను మర్చిపోలేదు. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు శ్రీదేవికి ఘనస్వాగతం పలికారు. పదిహేనేళ్ల క్రితం ఎంత అద్భుతంగా నటించారో, ఇంత విరామం తర్వాత కూడా శ్రీదేవి అంతే అద్భుతంగా నటించారు.
దాంతో ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ తర్వాత చాలామంది దర్శక, నిర్మాతలు శ్రీదేవితో సినిమా చేయడానికి ఆసక్తి కనబర్చారు.కానీ, మళ్లీ విజయవంతమైన సినిమానే చేయాలని ఆచితూచి అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ తమిళ చిత్రంలో నటించడానికి ఆమె పచ్చజెండా ఊపారని సమాచారం. విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఓ కాల్పనిక కథతో అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని సమాచారం. ఇందులో ఓ కీలక పాత్రకు శ్రీదేవిని, మరో కీలక పాత్రకు కన్నడ నటుడు, ‘ఈగ’ ఫేం సుదీప్‌ని తీసుకున్నారు. మరో మూడు నాలుగు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే సినిమా కాబట్టి, ఇప్పటికే ఆ పనులు ప్రారంభించారట. అనువాద చిత్రం ‘ఆంగిలమ్ వాంగిలమ్’ (‘ఇంగ్లిష్ వింగ్లిష్’ తమిళ వెర్షన్ టైటిల్) తర్వాత శ్రీదేవి తమిళంలో స్ట్రయిట్ సినిమా అంగీకరించడం అక్కడి అభిమానులకు తీపి వార్తే!