వాళ్ల విమర్శకు నా సమాధానం ఒక్కటే...
‘‘తొలి విజయం కంటే... మలి విజయం ప్రాధాన్యం ఎక్కువ. అది దక్కితే కలిగే ఆనందమే వేరు. ప్రస్తుతం ఆ ఆనందంలోనే ఉన్నాను’’ అంటున్నారు దర్శకుడు విజయ్‌కుమార్ కొండా. ‘గుండె జారి గల్లంతయ్యిందే’తో మంచి దర్శకుడు అనిపించుకున్నవిజయ్‌కుమార్ తన రెండో సినిమానే అన్నపూర్ణా స్టూడియోస్ సంస్థకు చేసే అవకాశం దక్కించుకొని ‘ఒక లైలా కోసం’ చేశారు. గత వారం విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్న విజయ్‌కుమార్ సోమవారం విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆయన ఏమన్నారంటే...
‘‘ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా... సుఖంగా ఉండాలని కోరుకునేవాడే నా దృష్టిలో నిజమైన ప్రేమికుడు. ఒక అమ్మాయి మనసులో స్థానం సంపాదించుకోవడం చాలా కష్టమైన విషయం. ఇదే ప్రధానాంశంగా తీసుకొని ‘ఒక లైలా కోసం’ తీశాను. మనసుల్ని మెలిపెట్టే భావోద్వేగాలతో కూడిన పొయిటిక్ ప్రేమకథ ఇది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కథ తయారు చేశాను. చూసిన వారందరూ బాగుందని అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇందులో హీరో పాత్రకు ఎలాంటి లక్ష్యం లేదా? అనే విమర్శ వినిపించింది. దానికి సమాధానం ఒక్కటే... ఒక అమ్మాయి మనసులో స్థానం సంపాదించుకోవడానికి మించిన గొప్ప లక్ష్యం ఈ ప్రపంచంలో వేరే ఉండదు. ఆ తర్వాత విజయాలన్నీ వాటంతట అవే వచ్చి చేరతాయి. నిజాయతీగా అమ్మాయి ప్రేమను గెలిచిన ఎవరైనా జీవితాన్ని కూడా గెలుస్తారు. ఈ సినిమాలో నేను చెప్పింది అదే. హీరోగా నాగచైతన్య వంద శాతం న్యాయం చేశాడు. ఈ సినిమా నటునిగా ఆయనను మరో మెట్టుపై కూర్చొబెట్టింది.’’