అప్పట్లో నాన్నగారు... తర్వాత నేను...ఇప్పుడు చైతు.. : నాగార్జున
‘‘మజ్ను, గీతాంజలి చిత్రాలతో నాకు రొమాంటిక్ హీరో ఇమేజ్ వచ్చింది. ‘శివ’ తర్వాత నేను యాక్షన్ హీరో అనిపించుకున్నాను. నాగచైతన్యకు కూడా యాక్షన్ ఇమేజ్ రావడానికి కాస్త టైమ్ పడుతుంది. తప్పకుండా త్వరలో మంచి యాక్షన్ హీరో అనిపించుకుంటాడు’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. నాగచైతన్య, పూజా హెగ్డే జంటగా విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన ‘ఒక లైలా కోసం’ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ -‘‘అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఫీల్‌గుడ్ సినిమాలే ఎక్కువగా వచ్చాయి.
నాన్నగారు ఎక్కువ శాతం అలాంటి చిత్రాల్లోనే నటించారు. నన్ను కూడా అలాంటి సినిమాల్లోనే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించారు. అలాగే ఇప్పుడు చైతూను కూడా. మా కుటుంబానికి ఇలాంటి కథలే నప్పుతాయేమో. నాగచైతన్యకు ఏమాయ చేశావె, 100%లవ్ చిత్రాలతో లవర్‌బోయ్ ఇమేజ్ ఎప్పుడో వచ్చేసింది. ఈ సినిమా కూడా వాటి తరహా రొమాంటిక్ ఎంటర్‌టైనరే. ఇందులో చైతూ పరిణతి చెందిన కుర్రాడిగా నటించాడు. నటునిగా చైతూని మరింత ఎత్తులో నిలబట్టే సినిమా ఇది’’ అని అన్నారు. ఫీల్‌గుడ్ సినిమా ఇదని, పూజా గ్లామర్, అలీ కామెడీ అందరికీ నచ్చుతాయనీ నాగచైతన్య చెప్పారు.
ఏ ప్రేమికుడూ ఏ ప్రేయసికీ ఇవ్వని బహుమతిని ఈ సినిమాలో హీరోయిన్‌కి హీరో ఇస్తాడని, అదేంటో తెరపైనే చూడాలనీ, ప్రతిష్ఠాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించిన 25వ చిత్రానికి తాను దర్శకుణ్ణి కావడం ఆనందంగా ఉందని విజయ్‌కుమార్ కొండా చెప్పారు. పాటలకు మంచి స్పందన లభిస్తోందని అనూప్ ఆనందం వెలిబుచ్చారు. ఇందులో హీరోయిన్‌గా చేయడం కాస్త కష్టంగా అనిపించిందనీ, అయితే... అవుట్‌పుట్ చూశాక చాలా సంతోషం అనిపించిందనీ పూజా హెగ్డే అన్నారు.