గిలిగింతలు పెట్టే ప్రేమకథ
‘ఒక లైలా కోసం... తిరిగాను దేశం’ అంటూ... ‘రాముడు కాదు కృష్ణుడు’లో అక్కినేని చిందేస్తుంటే... నాటి యువతరం ఆనందంతో ఊగిపోయారు. ఆ మాటకొస్తే ఆ పాట ఎవర్ గ్రీన్. వింటే... ఇప్పటి యువతరానికీ కిక్కెక్కించక మానదు. అందుకేనేమో... తాత పాట పల్లవిలోని తొలి పదాన్ని మనవడు నాగచైతన్య టైటిల్‌గా పెట్టేసుకున్నాడు. ప్రస్తుతం ‘ఒక లైలా కోసం’ చిత్రం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేం విజయకుమార్ కొండా దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. మనసుల్ని గిలిగింతలు పెట్టే కథ, కథనాలతో ఈ చిత్రం రూపొందుతోందనీ, చైతూ కెరీర్‌లో మెమరబుల్ హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుందని దర్శకుడు చెప్పారు. త్వరలోనే ఈ సినిమా ప్రచార చిత్రాలను, ఆడియోను విడుదల చేయడానికి నాగార్జున సన్నాహాలు చేస్తున్నారు. నాజర్, బ్రహ్మానందం, అలీ, ఆశిష్ విద్యార్థి, ప్రగతి, సుధ, దీక్షా పంత్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ. ఆండ్రూ, కూర్పు: ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిబాబా, సమర్పణ: శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ.