ఆ సినిమాకు ఆస్కార్‌ రావల్సింది... | Om Puri death: East is East, City of Joy and other English movies featuring the veteran actor | Sakshi
Sakshi News home page

ఆ సినిమాకు ఆస్కార్‌ రావల్సింది...

Published Fri, Jan 6 2017 7:03 PM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM

Om Puri death: East is East, City of Joy and other English movies featuring the veteran actor

న్యూఢిల్లీ: మొహం నిండా మచ్చలు. కళ్లలో నుంచి దూసుకొస్తున్న తీక్షణమైన చూపులు. కరకు కంఠం. చెమట కారుతున్న అంగీ. రోడ్డు పక్కన లాగుడు రిక్షాను ఆపి, ఆ పక్కనే ఉన్న బండిపై టీ తాగుతున్న వ్యక్తి. అచ్చం 1980వ దశకంలో మరో సినిమాలకు ప్రాణం పోసి ప్రపంచ ఖ్యాతి నార్జించిన ఓంపురిలా ఉన్నాడు. ఆ వ్యక్తి గురించే ఆ పక్కనే ఉన్న ఓ ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నారు. ‘అరే అచ్చం ఓంపురిలాగే ఉన్నాడు కదా!’ అంటూ ఓ మిత్రుడు తోటి మిత్రుడిని ప్రశ్నించగా, ‘అవును కొంత అలాగే కనిపిస్తున్నాడుగానీ, ఓంపురి కలకత్తాకు ఎందుకు వస్తాడు? వస్తే, ఇలా రోడ్డు పక్కన మనలాగా టీ ఎందుకు తాగుతాడు, పైగా లాగుడు రిక్షాతో ఎందుకు కనిపిస్తాడు?!’ అని ఆ మిత్రుడు వ్యాఖ్యానించారు.

ఈ మాటలను శ్రద్ధగా విన్న ఆ వ్యక్తి ‘అవును నేను ఓంపురినే’ అంటూ ఆ మిత్రుల సందేహాన్ని తీర్చేందుకు ప్రయత్నించారు. అయితే నమ్మనట్లుగానే ఆ ఇద్దరు మిత్రులు అక్కడి నుంచి కదిలారు. ‘బేచార, ఎంతటి వాడు ఎలా అయిపోయాడు. ఆక్రోష్, అర్ధసత్య, అల్బర్ట్‌ పింటో కో గుస్సా క్యోం ఆతా హై, జానేబీ దో యారో సినిమాలతో పాటు తమస్‌ లాంటి టీవీ సీరియళ్లను తీసిన ఓంపురి ఇప్పుడు కోల్‌కతాలో లాగుడు బండి లాగుతున్నాడు. ఎంతటి ఖర్మ!’ అంటూ ఆ టీ బండి వ్యక్తి తన కస్టమర్లతో వ్యాఖ్యానిస్తుండగా ఓంపురి తనలో తాను నవ్వుకుంటూ ఆ లాగుడు రిక్షాను పట్టుకొని తన మానాన తాను వచ్చేశాడు.

1992లో విడుదలైన ‘సిటీ ఆఫ్‌ జాయ్‌’ ఇంగ్లీష్‌ సినిమా షూటింగ్‌ కోసం కోల్‌కతా వచ్చిన ఓంపురి లాగుడు రిక్షా నేర్చుకోవడం కోసం వారం రోజుల పాటు కోల్‌కతా వీధుల్లో ఇలా కసరత్తు చేస్తుండగా ఓ రోజు ఆయనకు ఈ అనుభవం ఎదురైంది. దాని గురించి ఆయన భార్య నందితా పురి, ఓంపురి ఆత్మకథలో రాశారు. రోలాండ్‌ జఫే దర్శకత్వం వహించిన ఈ ‘సిటీ ఆఫ్‌ జాయ్‌’ సినిమాలో ఓంపురితోపాటు ప్యాట్రిక్‌ సాయజ్‌ అనే హాలివుడ్‌ నటుడు కూడా ప్రధాన పాత్రలో నటించారు. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్దగా నడవకపోయినా అప్పుడు ‘న్యూయార్స్‌ టైమ్స్‌’ పత్రిక మాత్రం సినిమాలో ఓంపురి నటన గురించి విశేషంగా ప్రశంసించింది.

‘ఈ ఏడాది ఎవరికైనా ఆస్కార్‌ అవార్డ్‌ ఇవ్వాల్సి వస్తే మొట్టమొదట ఓంపురికి ఇవ్వాలి’ అని ఆ పత్రిక కొనియాడగా, ఓంపురికి ఆస్కార్‌ వచ్చి తీరుతుందని తోటి నటుడు ప్యాట్రిక్‌ సాయజ్‌ నాడు విలేకరుల సమావేశం వ్యాఖ్యానించారు. ఆస్కార్‌ అవార్డు రాకపోయినా కనీసం నామినేషన్‌ వస్తుందని భావించానని ఆ తర్వాత ఓంపురి ఓ  సందర్భంలో చెప్పారు. ఆతర్వాత ‘మై సన్‌ ఆఫ్‌ ఫెనటిక్, ఈస్ట్‌ ఈజ్‌ ఈస్ట్, శ్యామ్‌ అండ్‌ మీ’ లాంటి హాలివుడ్‌ చిత్రాల్లో నటించారు. ‘ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయే మహానటుడు ఓంపురి, అలాంటి నటులు మళ్లీ పుట్టడం మహా అరదు’ అని బాలివుడ్‌ దర్శకుడు కుందన్‌ షా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement