
మన సంప్రదాయాన్ని కాపాడుకుందాం!
నటుడు శింబు మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును కూడా ఎత్తి చూపేవిధంగా మాట్లాడి చర్చకు దారి తీశారు.
నటుడు శింబు మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును కూడా ఎత్తి చూపేవిధంగా మాట్లాడి చర్చకు దారి తీశారు. ఏదో ఒక చర్యతో వివాదాలకు నటుడు శింబు సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతుంటారు. ఆ మధ్య బీప్‌సాంగ్‌తో పెద్ద సంచలనం కలిగించిన ఈయన తాజాగా నిషేధానికి గురైన జల్లికట్టు క్రీడకు మద్దతుగా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకెక్కారు. అదేమిటో ఆయన మాటల్లోనే చూద్దాం. జల్లికట్టు మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నం. కొందరు వ్యక్తులు, స్వార్థంతో కూడిన కొన్ని సంఘాలు తప్పుడు సమాచారంతో ఈ క్రీడను జరగకుండా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం, న్యాయస్థానం రగులుతున్న పలు సమస్యలపై దృష్టి సారించకుండా జల్లికట్టును నిషేధించడం ప్రధాన బాధ్యతగా తలచడం ఎందుకో అర్థం కావడంలేదు.
జల్లికట్లు క్రీడ అన్నది తమిళుల వీరత్వానికి నిదర్శనం. అంతే కాదు మన ఎద్దుల జాతి హరించకుండా కాపాడే విధానం. అలాంటి జల్లికట్టు క్రీడను కోర్టు తీర్పు కారణంగా రెండేళ్లుగా నిర్వహిచంలేని పరిస్థితి. ఒక దేశ పౌరుడిగా ప్రతి తమిళుడు న్యాయస్థానాలను గౌరవిస్తున్నారు. అయితే అది తమిళ సంస్కృతిని మీరేదిగా ఉండదు, ఉండరాదు కూడా. మన సంస్కృతికి తూట్లు పొడిచే ఎలాంటి చట్టం అయినా మన ఆత్మాభిమానాన్ని బాధిస్తుందన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరుగుతారని నమ్ముతున్నాను. ఈ దేశ పౌరుడిగా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలసిన బాధ్యత ఉన్న వాడిగా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. తమిళనాడులో పొంగల్ సందర్భంగా జల్లికట్టును నిర్వహించాలని పలు సంఘాలు ఆందోళనలు చేపడుతున్నారు.
ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెతక వైఖరిని చూపకుండా జల్లికట్టు క్రీడను నిర్వహించడానికి తీవ్ర చర్యలు తీసుకోవాలి. మన సంస్కృతి, సంప్రదాయాలు మళ్లీ పరిరక్షింపబడతాయని నమ్ముతునాను. జల్లికట్టును నిర్వహించేవరకూ విశ్రమించకూడదు. ఇది మన సంస్కృతి, సంప్రదాయం. మన పారంపర్యాన్ని ఎవరి కోసం విడనాడేదిలేదు. శింబు వ్యాఖ్యలపై రియాక్షన్ ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి.