విజయ్ సేతుపతితో మరోసారి..
పిజ్జా చిత్రంతో సూపర్‌హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జంటగా విజయ్ సేతుపతి, రమ్యానంబీశన్ చాలా గ్యాప్ తరువాత వీరిద్దరూ కలసి మరోసారి వెండితెరపై రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. ఈ క్రేజీ చిత్రాన్ని నూతన నిర్మాణ సంస్థ వాసన్ మూవీస్ నిర్మించనుంది. ఈ చిత్ర వివరాలను ఆ సంస్థ అధినేత షాన్ సుదర్శన్ వెల్లడిస్తూ విజయ్‌సేతుపతి, రమ్యానంబీశన్ హీరో హీరోయిన్లుగా ఒక కొత్త కాన్సెప్ట్‌తో చిత్రాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ఇంతవరకు చాలా పోలీసు కథలు వచ్చాయన్నారు. అయితే వాటికి భిన్నంగా ఖాకీ దుస్తులకు గౌరవాన్ని, ఆ వృత్తికి గంభీరాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు.
విజయ్ సేతుపతి పోలీసు అధికారిగా ఒక కొత్త డైమన్షన్‌లో కనిపిస్తారని తెలిపారు. ఈ చిత్రం సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుందని తెలిపారు. ఇంతకుముందు విజయ్ సేతుపతి హీరోగా పణ్ణయారుం పద్మినియుం చిత్రాన్ని తెరకెక్కించిన ఎస్‌యు అరుణ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలిపా రు. చిత్రం త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. చిత్రానికి నివాస్ కె.ప్రసన్న సంగీతాన్ని, దినేష్ కృష్ణన్ ఛాయాగ్రహణం, పోరాట సన్నివేశాల బాధ్యతలను అన్భ్‌రివులు నిర్వహిస్తున్నారని, నిర్మాత షాన్ సుదర్శన్ వెల్లడించారు.