స్త్రీలను గౌరవించండి!
ఆమిర్‌ఖాన్ రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎప్పుడూ ముందుంటారు.
ఆమిర్‌ఖాన్ రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎప్పుడూ ముందుంటారు. బుల్లితెరపై ‘సత్యమేవ జయతే’ షో ద్వారా సమాజంలో జరుగుతున్న పలు అక్రమాలను ఆయన ప్రస్తావించిన విషయం తెలిసిందే. అలాగే, సమాజానికి చేటు చేసే వాణిజ్య ప్రకటనల్లో నటించకూడదని బలంగా నిర్ణయించుకున్నారు. దాన్నిబట్టి ఆయనకెంత సామాజికస్పృహ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ స్పృహతోనే ‘వన్ బిలియన్ రైజింగ్ మూమెంట్’కి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చారు ఆమిర్.
ఆడవాళ్లపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టాలంటూ గొంతెత్తి చెప్పడమే ఈ మూమెంట్ ఆశయం. గత ఏడాది జరిగినట్లుగానే ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 14న ఈ కార్యక్రమం జరుగనుంది. గత ఏడాది దాదాపు 193 దేశాలకు చెందినవారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా దేశాల్లో ఎవరికి తోచిన రీతిలో వాళ్లు నినాదాలు చేస్తూ, డాన్స్ చేస్తూ... వివిధ పద్ధతుల్లో ఈ మూమెంట్‌లో పాల్గొని తమ మద్దతుని తెలియజేస్తుంటారు. ఈసారి ఆమిర్‌ఖాన్ ఓ వీడియో సందేశం ద్వారా ఈ మూమెంట్‌కి మద్దతుని తెలియజేస్తున్నారు. ‘స్త్రీలను గౌరవించండి. హింసించడం మానండి’ అంటూ హితబోధ చేస్తున్నారు ఆమిర్. ఆడ, మగ అందరూ ఈ మూమెంట్‌లో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.