మేజిక్ అంతా ఒక్క సినిమాతోనే!
‘‘నేను, నాది అనే స్వార్థంలో ఆనందం లభించదు. ‘మనం’ అనే ఫీలింగ్‌లో ఎంతో హాయి ఉంటుంది’’ అంటున్నారు సమంత. అందం, అభినయం రెండూ సొంతం చేసుకున్నారు కాబట్టే.. తక్కువ సమయంలో ‘స్టార్ హీరోయిన్’ అయ్యారామె. అయితే, ఇదంతా పూర్తిగా తన క్రెడిట్ మాత్రమే కాదంటూ- ‘‘మామూలు ఆర్టిస్ట్‌ని ‘స్టార్’ని చేసేది వాళ్లు పోషించే పాత్రలు. నిరూపించుకోదగ్గ పాత్రలు చేసి, మంచి సక్సెస్‌లు చేజిక్కించుకుని ‘స్టార్’ అవుతాం. కానీ, ఆ స్టార్ హోదా అలా కొనసాగాలంటే ప్రేక్షకుల అభిమానం ఎంతో ముఖ్యం. వాళ్లు అభిమానించకపోతే ‘స్టార్’ అనిపించుకోలేం. ఇక, సినిమా పరిశ్రమ గురించి చెప్పాలంటే, చాలా విచిత్రమైంది. ఇవాళ నువ్వు ఏమీ కావు.. కానీ ఒక్క సక్సెస్ వచ్చిందంటే చాలు, రేపటికల్లా సూపర్ స్టార్ అయిపోతావ్. మేజిక్ అంతా ఒక్క సినిమాతోనే జరిగిపోతుంది.
‘ఏ మాయ చేశావె’తో నా అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ‘ఈగ’ తర్వాత పెద్ద సంస్థల్లో చేసే అవకాశం వస్తోంది. అందుకే చెబుతున్నా... ఒక్క సినిమా జీవితాన్ని మార్చేస్తుందని. ఒకవేళ టైమ్ బాగాలేదనుకోండి... ఆ ఒక్క సినిమానే జీవితాన్ని తారుమారు చేస్తుంది. అందుకే జయాపజయాలకు సమానంగా స్పందిస్తూ వెళ్లిపోవాలి. సక్సెస్‌ని నెత్తికెక్కించుకుంటే కష్టం. అలాగే ‘నా జీవితం.. నా ఆనందం’ అని కాకుండా ఇతరులకు కూడా సహాయపడితే అప్పుడు నిజమైన ఆనందాన్ని చవిచూడొచ్చు’’ అన్నారు సమంత.