తొలి సినిమాతో కావచ్చు...కాలం కలిసిరాక అది ఆడకపోతే...మరో రెండు సినిమాల తరువాతనైనా కావచ్చు... బ్రహ్మాండమైన గుర్తింపు వస్తుంది. కానీ కేరళ కుట్టి ప్రియా వారియర్... తొలి సినిమా విడుదల కాకముందే కన్నుగీటే దృశ్యంతో స్టార్‌డమ్ తెచ్చుకుంది. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో నిలిచింది. ‘ఎవరీ అమ్మాయి?’ అని దేశమంతా ఆరా తీసింది. ‘లవర్స్ డే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియా ప్రకాష్ వారియర్ గురించి కొన్ని ముచ్చట్లు...
అదేమిటో మరి...
కేవలం ఒకేఒక సినిమాలో ఒకేఒక దృశ్యం తనకు బోలెడు గుర్తింపు తీసుకువస్తుందని కలలో కూడా అనుకోలేదు ప్రియా. తొలిచిత్రం ‘ఒరు ఆడార్ లవ్’లో చిలిపిగా కన్నుగీటే సీన్ చేసింది ప్రియా. ఈ సీన్ సోషల్‌మీడియాను కుదిపేసింది. ‘‘నిజానికి నాకంటే అందంగా కన్నుగీటే వాళ్లు చాలామంది ఉన్నారు. నాకు మాత్రం బాగా గుర్తింపు వచ్చింది’’ అని నవ్వుతుంది ప్రియా. కన్నుకొట్టే సన్నివేశం సంచలనం కావడంతో ‘ఒరు ఆడార్ లవ్’ సినిమాలో ప్రియా పాత్ర నిడివిని పెంచడం కోసం డైరెక్టర్ ఒమర్ స్క్రిప్ట్ కూడా మార్చవలసివచ్చిందట! ‘‘ప్రేక్షకులు నన్ను పెద్ద పాత్రలో చూడాలనుకుంటున్నారు’’ అంటుంది ప్రియా.
ఇలా కూడా!
పార్లమెంట్‌లో ప్రధాని మోదీని చూసి రాహుల్‌గాంధీ కన్నుగీటిన దృశ్యం టీవీలో కనిపించిందో లేదో...దీనిపై కామెంట్ తీసుకోవడానికి మీడియా మొత్తం ఆమె ఇంటి దగ్గరే ఉందట! ప్రియాను ఆకాశానికెత్తే కామెంట్లే కాదు, ‘పెద్ద అందగత్తేమీ కాదు... మేకప్‌తో మ్యానేజ్ చేస్తుంది’ అంటూ విమర్శించే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. వివాదాలు కూడా అప్పుడే లైన్ కట్టాయి. ‘మాణిక్య మలరాయ పూవి’ పాటపై, ‘శ్రీదేవి బంగ్లా’ సినిమా టీజర్‌పై వివాదాలు లేచాయి.. ఇలాంటివి పెద్దగా పట్టించుకోకుండా నటన మీదే శ్రద్ధ పెడుతుంది ప్రియా. ‘‘నన్ను నేను నిరూపించుకోవాల్సి ఉంది’’ అంటోంది ఆత్మవిశ్వాసంతో.
పాడుతా తీయగా!
కేరళలలోని త్రిసూరు విమల కాలేజీలో బీకాం చదివిన ప్రియాకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. నటి కావాలనేది తన కోరిక. తల్లిదండ్రులు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. శాస్త్రీయ నృత్యంలో ప్రవేశం ఉన్న ప్రియా వారియర్ చక్కగా పాడుతుంది. భవిష్యత్‌లో సినిమాల్లో పాడే అవకాశం వస్తే సంతోషంగా పాడుతాను అంటుంది. ‘‘గుర్తింపు తాలూకు గర్వాన్ని తలకెక్కించుకోవద్దు’’ అని తల్లి చెప్పిన మంచిమాటను ఎప్పుడూ గుర్తుంచుకుంటుందట ప్రియా ప్రకాష్ వారియర్.
Comments
Please login to add a commentAdd a comment