ఆస్కార్ ముచ్చట్లు
అవార్డ్ మర్చేపోయాడు!
ఇరవై మూడేళ్ల తర్వాత దక్కిన తొలి ఆస్కార్‌ను ఎంత అపురూపంగా చూసుకోవాలి? ఉత్తమ నటునిగా ఆస్కార్ అవార్డు దక్కించుకున్న లియొనార్డో డికాప్రియో మాత్రం ఈ బంగారు బొమ్మను మర్చిపోయాడు. సహజంగా పార్టీ ప్రియుడైన డికాప్రియో తన స్నేహితులకు ఆస్కార్ వేడుకల తర్వాత పెద్ద పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో హ్యాపీగా గడిపిన ఆయన పార్టీ అయిపోయాక, అందుకున్న ఆస్కార్ ప్రతిమను మర్చిపోయి, కారు ఎక్కేశారు.
ఇక కారు స్టార్ట్ అవుతుందనగా సదరు హోటల్ సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి కారులో ఉన్న డికాప్రియో ఒక చేతితో ష్యాంపైన్ బాటిల్, మరో చేతితో ఆస్కార్ ఇవ్వగానే ఆశ్చర్యపోవడం అందరి వంతైందట. ఇదిలా ఉండగా, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ డికాప్రియోను అభినందించారు. ‘‘ఎట్టకేలకు డికాప్రియో ఉత్తమ నటునిగా ఆస్కార్ అందుకున్నాడు. అతడు ఈ గౌరవానికి అర్హుడు’’ అంటూ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. డికాప్రియోతో కలిసి ‘గ్రేట్ గాట్స్‌బీ’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించారు అమితాబ్. ఆ సమయంలో డికాప్రియోతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారాయన.
స్విల్వెస్టర్‌కు మరో కండల వీరుడి ఓదార్పు!
కండలు తిరిగిన నటుడు సిల్వెస్టర్ స్టాలెన్‌కు ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో నిరాశే ఎదురైంది. దాదాపు 40 ఏళ్ల తర్వాత దక్కిన మూడో నామినేషన్‌లో కూడా ఆస్కార్ ఆయనను వరించలేదు. 1977లో ‘రాకీ’ తర్వాత ‘క్రీడ్’ చిత్రానికి గానూ ఈ ఏడాది ఉత్తమ సహాయనటుని విభాగంలో పోటీపడ్డారు. అయితే ఈ సారి కూడా ఆయనను ఆస్కార్ వరించలేదు. ‘బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్’ చిత్రానికి గానూ మార్క్ రైలాన్స్ ఈ విభాగంలో ఆస్కార్ అందుకున్నారు. స్టాలెన్ దీని గురించి ఏ కామెంట్ చేయకపోయినా, ఆయన సోదరుడు ఫ్రాంక్ మాత్రం అకాడమీ తీరును దుయ్యబట్టాడు.
మార్క్‌కు ఈ అవార్డు ఇవ్వడం ఆస్కార్ అకాడమీ సిగ్గు పడాల్సిన విషయమంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే, కండల వీరుడైన మరో నటుడు ఆర్నాల్డ్ ష్వార్జెనగర్ మాత్రం స్టాలెన్‌కు బాసటగా నిలిచారు. ‘ఎవరేమన్నా సరే, నాకు మాత్రం నువ్వే బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు ఆర్నాల్డ్. ఇది ఇలా ఉండగా, అకాడెమీని విమర్శించిన ఫ్రాంక్ సైతం ‘‘అవార్డు వచ్చిన మార్క్‌ను విమర్శించాలన్నది నా ఉద్దేశం కాదు. ఈ అవార్డుకు నా సోదరుడు స్టాలెన్ అర్హుడని చెప్పాలనే ఆ వ్యాఖ్యలు చేశా’’ అంటూ వివరణ ఇచ్చారు.
అతి తక్కువ ఆదరణ
‘ఆస్కార్ సో వైట్’ అనే విమర్శల నుంచి బయటపడటానికి ఆస్కార్ అకాడమీ ఈ ఏడాది ఆస్కార్ వేడుకలకు హోస్ట్‌గా నల్ల జాతీయుడు క్లిస్ రాక్‌ను వ్యాఖ్యాతగా ఎంపిక చేసింది. కానీ, ఈ చిట్కాలేవీ టీవీ రేటింగ్స్‌ను మాత్రం పెంచలేకపోయాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఆస్కార్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 43 లక్షల మంది టీవీల్లో వీక్షించారట. గడిచిన ఎనిమిదేళ్లతో ఇంత తక్కువ వ్యూయర్‌షిప్ నమోదు కావడం ఇదే తొలిసారి. నీల్ ప్యాట్రిక్ హ్యారిస్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన 87వ ఆస్కార్ వేడుకలను 3 కోట్ల 72 లక్షల మంది చూశారు. అయితే ఈ సారి నల్ల జాతీయులెవరూ నామినేట్ కాకపోవడం కూడా దీనికి కారణమని కొంత మంది సినీ విశ్లేషకులు చెబుతున్నారు.