ఆస్కార్ ను లైట్ తీసుకున్నారు!
ఈ ఏడాది ఉత్తమ సినిమా, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి.. అంటూ హాలీవుడ్ సినీ రంగంలో అద్భుత ప్రతిభ కనబర్చినవారిని సత్కరించే ఆస్కార్ వేడుకలకు.. టీవీల్లో అత్యధికులు వీక్షించే ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ గానూ రికార్డుంది. అయితే మూడు రోజుల కిందట జరిగిన 88వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవాన్ని మాత్రం వీక్షకులు లైట్ తీసుకున్నారు. తిప్పికొడితే ప్రపంచ వ్యాప్తంగా 3.6 కోట్ల మంది మాత్రమే ఆస్కార్ ప్రత్యక్ష ప్రసారాల్ని చూశారు!
హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్ లో అట్టహాసంగా నిర్వహించిన ఆస్కార్ వేడుకలకు కమెడియన్ క్రిస్ రాక్, నటుడు నీల్ ప్యాట్రిక్ హ్యారిస్ లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మొత్తం కార్యక్రమంలో యాంకర్ క్రిస్ రాక్ తప్ప నామినీలుగా నల్లజాతీయులెవరికీ చోటు దక్కకపోవటమే రేటింగ్స్ దారుణంగా పడిపోవడానికి కారణమని తెలుస్తోంది. నిజానికి నల్లజాతి నటులకు నామినేషన్లు దక్కకపోవటంపై మొదటి నుంచే వివాదం రగులుతోంది. అదికాస్తా టీవీ ప్రసారాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. యూఎస్ లోని ఆ వర్గాలకు చెందిన కొన్ని సంస్థలు అస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించాలని బహిరంగానే పిలుపిచ్చాయి.
దీంతో గత ఎనిమిదేళ్లలోనే అతి తక్కువ వ్యూవర్ షిప్ నమోదయింది. ప్రముఖ సర్వే సంస్థ నెల్సన్ ఈ విషయాలను వెల్లడించింది. 2009లో 37.26 మిలియన్ల మంది ఆస్కార్ అవార్డు ఫంక్షన్ లైవ్ ను టీవీల్లో చూశారు. ఆ కార్యక్రమానికి సంబంధించి అది లోయెస్ట్ వీవర్ షిప్ కాగా ఈ ఏడు అంతకన్నా తక్కువ.. 36.6 మిలియన్ల మంది మాత్రమే చూశారు. అలా చూసిన వారిలోనూ 58 మిలియన్ల మంది ఆరు నిమిషాల్లోపే ఛానెల్ మార్చేశారట!