
కృష్ణతో మరోసారి..
తమిళసినిమా: దేశ వ్యాప్తంగా బుల్లితెర అభిమాన లోకాన్ని కట్టిపడేస్తున్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షో తమిళ వెర్షన్‌లో పాల్గొని ఒక్కసారిగా భారీ స్టార్‌డమ్ సొంతం అందాల రాశి ఓవియా. ‘కలవాని’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అయినా అమ్మడు అనుకున్నంత స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ‘బిగ్ బాస్’ షోతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
దీంతో పలువురు హీరోలు, దర్శక నిర్మాతలు తమ సినిమాలకు ఓవియాను బుక్ చేసుకోవాలని తహతహలాడుతున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించే రీతిలో ఇది వరకే ఓవియా నటించిన ‘శీని’ చిత్రం టైటిల్ పేరు మార్చి తాజాగా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇలయదళపతి విజయ్ కొత్త చిత్రంలో ఓవియాను నటింపచేయాలని దర్శకుడు మురుగదాస్ నిర్ణయించినట్టు ఇటీవల వార్తలు వెల్లడయ్యాయి.
అదేవిధంగా ‘సిలుక్కువార్‌పట్టి సింగం’, ‘ఇరవుక్కు ఆయిరం కన్గల్’ చిత్రాల్లో నటించిన ఓవియాను ‘అరిమా నంబి’ చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ తన కొత్త చిత్రంలో నటింపచేయాలని నిర్ణయించారట. ఓవిమా అభిమానుల మనస్సులో చెరగని ముద్రలా నిలిచిపోయిందని, ఆమెను తన తర్వాత చిత్రంలో నటింపచేసే అవకాశం ఉందని ఆయన ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ స్థితిలో ఇది వరకే నటించిన ‘యామిరుక్క భయమేన్’ రెండో భాగంలో కూడా తిరిగి ఓవియా నటిస్తున్నారు. కృష్ణ హీరో నటిస్తున్న ఈ చిత్రంలో ఓవియాతో పాటు మరి కొందరు నటీమణులు నటించారు. అయితే ఈ రెండో భాగంలో ఓవియా మాత్రమే ముఖ్య భూమికను పోషిస్తున్నారట.