సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ చిత్రంపై రాష్ట్రీయ స్వయక్ సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) అనుబంధ సంస్థ అఖిల భారతీయ ఇతిహాస్ సంకలన్ యోజన (ఏబీఐఎస్‌వై) అత్యంత తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ చిత్రం భారతీయ మహిళలను కించపరిచేలా ఉందని వ్యాఖ్యానించింది. అంతేకాక ఆత్మగౌరవానికి ప్రతీకలా నిలిచే భారతీయ మహిళల వ్యక్తిత్వాన్ని ఈ చిత్రం హత్యచేసేలా ఉందని ఏబీఐఎస్‌వై అత్యంత తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం సినిమాలు తీసేవారు.. డబ్బును సంపాదించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఏబీఐఎస్‌వై వ్యాఖ్యానించింది. డబ్బు సముపార్జనలో చరిత్రను సైతం వక్రీకరించేందుకు ఏ మాత్రం వెనుకాడ్డంలేదని ఏబీఐఎస్‌వై జాతీయ ప్రధాన కార్యదర్శి బాలముకుంద్ పాండే పేర్కొన్నారు.
భారతీయ, రాజపుత్రలు చరిత్రలో రాణీ పద్మావతికి అత్యంత గౌరవనీయ స్థానం ఉందని ఆయన చెప్పారు. ఈ చిత్రం ద్వారా రాణీ పద్మావతిని మాత్రమేకాక.. యావత్ భారతీయ మహిళలను కించపరిచారని ఆయన అన్నారు. భారతీయ మహిళల గౌరవాన్ని అధఃపాతాళానికి తొక్కొలా ఈ చిత్రం ఉందని బాలముకుంద్ పాండే తీవ్రంగా విమర్శించారు. ఈ చిత్రం విడుదలను తప్పకుండా అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment