
'వరుసగా బెదిరింపులు వస్తున్నాయి'
కాబూల్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘బజ్‌రంగీ భాయిజాన్’ చిత్రంపై పాకిస్థాన్ సెన్సార్ బోర్డు చైర్మన్ ఫకర్ ఏ ఆలమ్‌కు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రజలను కించపరిచేలా చిత్రంలో వ్యంగ్యమైన యాసను ఉపయోగించారని, కొన్ని సెన్సార్ చేయాల్సిన దృశ్యాలను కూడా ఉన్నాయని విమర్శిస్తూ ఆలమ్‌కు పుంఖానుపుంఖాలుగా ట్వీట్లు వస్తున్నాయి.
అసలు ఎందుకు ఈ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతించందంటూ కూడా విమర్శలు వస్తున్నాయని, కొంతమంది తనను దేశద్రోహిగా ముద్రవేస్తూ బెదిరిస్తున్నారని కూడా ఆలం వెల్లడించారు. ఒకవేళ తాను ద్రోహినైతే ఈ సినిమాను చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కూడా తన దృష్టిలో ద్రోహియేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ విమర్శలతో సంబంధం లేకుండా పాక్ థియేటర్లలో బజ్‌రంగీ భాయిజాన్ చిత్రం బ్రహ్మాండంగా నడుస్తోంది. ఇప్పటికే వీకెండ్ వసూళ్లు వంద కోట్ల రూపాయలను దాటాయని చిత్రం పంపిణీదారులు తెలియజేస్తున్నారు. ఆలమ్‌కు ప్రేక్షకుల నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం నడుస్తున్న అన్ని థియేటర్ల వద్ద భద్రతను ఏర్పాటు చేశారు.
సెన్సార్ బోర్డు సభ్యులు, పాక్ చిత్ర పరిశ్రమ ఆలమ్‌కు అండగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం బాగా నడుస్తున్నప్పుడు మన దేశంలో మాత్రం దాన్ని ఎందుకు అడ్డుకోవాలని సెన్సార్ బోర్డు సభ్యులు వాదిస్తున్నారు. పైగా బోర్డులో సభ్యులుగా ఉన్న సైనిక ప్రతినిధులు కూడా సెన్సార్ బోర్డు నిర్ణయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయలేదన్న విషయాన్ని వారు గుర్తుచేశారు.