బాండ్ యాడ్పై పాన్ బహార్ క్లారిటీ
మాజీ జేమ్స్ బాంబ్ పీర్స్ బ్రోస్నన్ చేసిన పాన్ బహార్ యాడ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఓ పాన్ కంపెనీ ఏకంగా హాలీవుడ్ స్టార్ హీరోతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవటంతో ఆ యాడ్కు విపరీతమైన ప్రచారం లభించింది. అదే సమయంలో పొగాకు ఉత్పత్తులను జేమ్స్ బాండ్ ప్రమోట్ చేయటంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిగివచ్చిన బాండ్ నటుడు బ్రోస్నన్ వివరణ ఇచ్చుకున్నాడు.
అది హానికరమైనదని తనకు తెలియదని, తాను అది కేవలం టూత్ వైట్నర్ అన్న ఉద్దేశంతోనే ప్రమోట్ చేసేందుకు అంగీకరించానని తెలిపాడు. కంపెనీ అనుమతి తీసుకోకుండా తన ఫొటోను పొగాకు ఉత్పత్తులకు అనధికారింగా వినియోగించిందని తెలిపాడు. ఈ ప్రకటనతో నొచ్చుకున్న అభిమానులను క్షమాపణలు కూడా కోరాడు. అయితే ఈ వివాదం పై తాజాగా పాన్ బహార్ కంపెనీ స్పందించింది.
బాండ్తో చిత్రీకరించిన యాడ్ కాంట్రాక్ట్ ప్రకారమే చేశామని, అన్ని విషయాలు బ్రోస్నన్కు వివరించిన తరువాతే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఈ మేరకు పాన్ బహార్ కంపెనీ యజమాని దినేష్ జైన్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ ప్రాడక్ట్ తయారీలో పొగాకు వినియోగించలేదని, ఇది కేవలం మౌత్ ఫ్రెషనర్ మాత్రమే అని తెలిపాడు. అంతేకాదు తమతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్న బ్రోస్నన్ పై చట్టం పరంగా చర్యలు తీసుకునే విషయంపై కూడా చర్చిస్తున్నామని తెలిపారు.