
పేపర్ బోయ్ ప్రేమకథ
నేటి తరం దర్శకులు కేవలం డైరెక్షన్ వైపే కాదు.. సినిమా నిర్మాణంవైపూ అడుగులేస్తున్నారు. ఒకవైపు దర్శకునిగా తమను తాము ప్రూవ్ చేసుకుంటూనే, మరోవైపు వేరే దర్శకులతో సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ కోవలో సుకుమార్, మారుతి, సంపత్ నంది వంటి వారున్నారు. ఆది హీరోగా ‘గాలిపటం’ చిత్రం నిర్మించిన దర్శకుడు సంపత్ నంది తాజాగా ‘పేపర్ బోయ్’ సినిమా నిర్మిస్తున్నారు. సంతోష్ శోభన్, ఐశ్వర్య వాట్కర్ జంటగా జయశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గురువారం ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో గోపీచంద్ క్లాప్ ఇచ్చారు. హీరోయిన్ కేథరిన్ గౌరవ దర్శకత్వం వహించారు. చిత్రదర్శకుడు జయశంకర్‌కు సంపత్ నంది స్క్రిప్ట్ అందించారు. సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘హిలేరియస్ మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది. నేను దర్శకత్వం వహించిన ‘బెంగాల్ టైగర్’తో పాటు తమిళ చిత్రాలు ‘బిల్లా, మాట్రాన్’ వంటి భారీ చిత్రాలకు కెమెరామేన్‌గా చేసిన ఎస్.సౌందర్ రాజన్ ఈ ‘పేపర్ బోయ్’కి కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండటం విశేషం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల, నిర్మాతలు: సంపత్ నంది, వెంకట్, నరసింహ, కథ–స్కీన్ర్ ప్లే–మాటలు: సంపత్ నంది.