కోలీవుడ్‌కు పరిణితి చోప్రా
దక్షిణాది చిత్రపరిశ్రమలోకి ఉత్తరాది భామల దిగుమతి అప్రతిహంగా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. అనుష్క, ఇలియానా, హన్సిక, తాప్సీ ఇలా చాలా మంది ఉత్తరాది బ్యూటీస్ దక్షిణాదిని ఏలుతున్నారు. ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ లాంటి ముద్దుగుమ్మలు కూడా దక్షిణాది ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తారలే. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా చేరనుందని సమాచారం. ఈ అమ్మడిని ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ దక్షిణాదికి పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ జాణ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు, దర్శకుడు మురుగదాస్ సంప్రదింపులు జరిపి ఆమెను అంగీకరింపజేసినట్లు పరిశ్రమ వర్గాల మాట. ఈ అగ్ర దర్శకుడు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా తమిళం, తెలుగు భాషల్లో భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సమాయత్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో మహేష్‌బాబుతో ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయించనున్నారట. అందులో ప్రధాన భామగా పరిణితి చోప్రాను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం.
దక్షిణాది చిత్రాల్లో నటి ంచాలన్న తన చిరకాల కోరిక టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో కలసి నటించడం ద్వారా నెరవేరబోతున్నందుకు పరిణితి చోప్రా తెగ సంబరపడిపోతోందట. ఇక ఇతర బ్యూటీస్ కీర్తీసురేష్, సాయి పల్లవి ఇప్పటికే ఎంపికైనట్లు తెలిసింది.ఇందులో మహేష్‌బాబుకు ఎస్‌జే.సూర్య విలన్‌గా మారనున్నారని తెలిసింది. ఈ చిత్రం వచ్చే నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.