మహేష్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ
శ్రీమంతుడు సినిమాతో వంద కోట్ల కలెక్షన్లు సాధ్యం చేసి చూపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు, తన నెక్ట్స్ సినిమాల విషయంలో మరింత భారీగా ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న రాజకుమారుడు, ఆ సినిమాలో ముగ్గురు భామలతో ఆడిపాడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. వేసవి కానుకగా మేలో బ్రహ్మోత్సవం సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
బ్రహ్మోత్సవం సినిమా తరువాత మరోభారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు ప్రిన్స్. సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తెలుగు తమిళ భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఓ బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్గా సెలెక్ట్ చేశారు.
గతంలో ప్రీతిజింటా, నమ్రతా శిరోద్కర్, బిపాషాబసు, లిసారే, అమృత రావ్ లాంటి బాలీవుడ్ భామలతో జోడీ కట్టిన మహేష్, ఈసారి పరిణీతి చోప్రాను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఏప్రిల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.