‘చేతిలో డబ్బు లేదు...గుండె పగిలేలా ఏడ్చా’ | Parineeti Chopra Says About Her Hard Situations While Depression | Sakshi
Sakshi News home page

నా పని అయిపోయింది అనుకున్నా: హీరోయిన్‌

Published Tue, Aug 6 2019 2:12 PM | Last Updated on Tue, Aug 6 2019 2:22 PM

Parineeti Chopra Says About Her Hard Situations While Depression - Sakshi

తన సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వల్ల తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని బాలీవుడ్‌ భామ పరిణీతి చోప్రా అన్నారు. ఒకనాకొక సమయంలో తన దగ్గర కనీస అవసరాలకు కూడా డబ్బు లేకుండా పోయిందని జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. మంగళవారం ఓ వెబ్‌సైట్‌తో ఆమె మాట్లాడుతూ...‘ 2014 నుంచి 2015 మధ్య కాలంలో ఏడాదిన్నర పాటు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నా. నేను నటించిన దావత్‌-ఎ-ఇష్క్‌, కిల్‌ దిల్‌ సినిమాలు సరిగ్గా ఆడలేదు. నా జీవితంలో అది చాలా కఠినమైన సమయం. ఒక్కసారిగా అవకాశాలు తగ్గి చేతుల్లో డబ్బుల్లేని పరిస్థితి. కొత్తగా ఇల్లు కొన్నాను. పెద్ద సంస్థల్లో పెట్టుబడులు పెట్టాను. తీరా సమయానికి ఒక్క రూపాయి కూడా అందలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. నా జీవితంలో అదే అతిపెద్ద కుదుపు. రోజుకు పదిసార్లు గుక్కపట్టి.. గుండెపగిలేట్లుగా ఏడ్చేదాన్ని. అన్నం కూడా సహించేది కాదు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు దూరంగా ఉండేదాన్ని’ అని తాను అనుభవించిన వేదన గురించి పరిణీతి పంచుకున్నారు.

సాంత్వన చేకూర్చారు..
‘ఓ గదిలో నన్ను నేను బంధించుకునేదాన్ని. సరిగ్గా నిద్రపట్టేది కాదు. వారాల కొద్దీ ఎవరినీ కలవకుండా ఒంటరిగా గడిపేదాన్ని. ఇక నా పని అయిపోయింది అనుకున్నాను. అయితే నా సోదరుడు సహజ్‌, నా స్టైలిస్ట్‌ సంజనా బాత్రా నా గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. మానసిక ఆందోళనలో కూరుకుపోయిన నాకు సాంత్వన చేకూర్చారు. సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకునేలా నన్ను ప్రోత్సహించి.. మామూలు మనిషిగా మారేందుకు తోడ్పడ్డారు’ అని పరిణీతి తన ఆప్త మిత్రుల గురించి చెప్పుకొచ్చారు. డిప్రెషన్‌కు మనిషి ప్రాణాలు తీసే శక్తి ఉంటుందని.. కాబట్టి మన వాళ్లు ఎవరైనా అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నట్లయితే నిరంతరం వారిని గమనిస్తూ..కాపాడుకోవాలని సూచించారు. కాగా పరిణీతి... గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా కజిన్‌ అన్న సంగతి తెలిసిందే. ఇష్క్‌ జాదే సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన ఈ భామ...ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బొద్దుగా ఉన్నావంటూ వచ్చిన ట్రోల్స్‌కు పాజిటివ్‌గా స్పందించి ఆరోగ్యకర పద్ధతిలో బరువు తగ్గి పలువురికి ప్రేరణగా నిలిచారు. ప్రస్తుతం బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ షూటింగ్‌తో బిజీబిజీగా గడుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement