మహేశ్‌బాబుకు జంటగా పరిణితిచోప్రా
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో బాలీవుడ్ బ్యూటీ పరిణితిచోప్రా రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. కోలీవుడ్‌కు చెందిన సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమలహాసన్‌ల నుంచి అజిత్, సూర్య, కార్తీల వరకూ పలువురి చిత్రాలు టాలీవుడ్ తెరపై వెలిగిపోతుంటాయి. వీరి చిత్రాల అనువాదపు హక్కులు కూడా కళ్లు తిరిగే స్థాయిలో ఉంటాయి. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే రజనీకాంత్ తాజా చిత్రం తెలుగులో 34 కోట్లకు అమ్ముడు పోయిందన్నది సినీవర్గాల టాక్. ఇక తెలుగు చిత్రాలు తమిళంలోకి అనువాదం అయినా అంతగా లాభాలను అర్జించడం లేదు.
అయితే ఇటీవల ద్విభాషా చిత్రంగా విడుదలైన బాహుబలి చిత్రం తమిళంలో కూడా విశేష ప్రజాదరణ పొందింది. ఇది ఒక్క కారణం కాదు టాలీవుడ్ స్టార్ హీరోలకు తమిళంలోనూ తమ ఇమేజ్‌ను పెంచుకోవాలన్న కోరిక చాలా కాలంగానే ఉంది. అలా బాహుబలి ముందంజ వేసినా తాజాగా మహేశ్‌బాబు తమిళసినీ ప్రేక్షకులకు నేరు చిత్రాల హీరోగా పరిచయం కావడానికి సిద్ధమవుతున్నారు.
ఇందుకు ఆయన ఇక్కడి సూపర్ దర్శకుడు ఏఆర్.మురుగదాస్‌ను ఎంచుకున్నారు. తమిళం, తెలుగు భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కనున్న ఈ చిత్రానికి ముహూర్తం కుదిరింది. జూలై 15న పాట చిత్రీకరణతో ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో బ్రహ్మాండమైన సెట్ తయారవుతోందని సమాచారం. ఈ చిత్రానికి సంతోష్‌శివన్ చాయాగ్రహణం, హరీష్‌జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇందులో ప్రిన్స్ మహేశ్‌బాబు సరసన నటించే హీరోయిన్ గురించి రకరకాల ప్రచారం జరిగింది. ఇలియానా,శ్రుతిహాసన్ పేర్లు చక్కర్లు కొట్టాయి.అయితే దర్శకుడు ఏఆర్.మురుగదాసన్ బాలీవుబ్ బ్యూటీ పరిణీతి చోప్రాను మహేశ్‌బాబుతో రొమాన్స్ చేయించడానికి సిద్ధం అయ్యారు. ఇంకాపేరు నిర్ణయించని ఈ చిత్రం ద్వారా పరిణితిచోప్రా తొలిసారిగా దక్షిణాది చిత్ర సీమకు దిగుమతి అవుతున్నారన్నమాట.