ఖుషీగా మొదలు
తెలుగు దర్శకులతో పాటు చెన్నై దర్శకుల కథలంటే పవన్‌కల్యాణ్‌కు ఆసక్తి ఎక్కువ. గతంలో పలు తమిళ చిత్రాలను రీమేక్ చేసి హిట్స్ అందుకున్నారాయన. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ‘కాటమరాయుడు’ కూడా తమిళ చిత్రం ‘వీరమ్’కి రీమేకే. తాజాగా మరో తమిళ రీమేక్‌కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన ‘వేదాళం’ తెలుగు రీమేక్‌లో నటించడానికి అంగీకరించారాయన. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎస్.ఐశ్వర్య నిర్మించనున్న ఈ చిత్రానికి ఆర్.టి.నేసన్ దర్శకుడు. విజయదశమి సందర్భంగా సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం.
దర్శకులు కరుణాకరన్, ఎస్.జె.సూర్య, ధరణి, విష్ణువర్ధన్‌ల తర్వాత పవన్‌కల్యాణ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న తమిళ దర్శకుల్లో ఆర్.టి.నేసన్ ఐదో వ్యక్తి. ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ - ‘‘పవన్‌కల్యాణ్‌తో మూడో చిత్రమిది. సూర్య మూవీస్ పతాకంపై ‘ఖుషి’, ‘బంగారం’ చిత్రాలు నిర్మించాం. నా పర్యవేక్షణలో శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య నిర్మిస్తున్న 4వ చిత్రమిది. కమర్షియల్ ఎంటర్‌టైనర్. త్వరలో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు. ‘‘పవన్ ఇమేజ్‌కి తగ్గట్టు ‘వేదాళం’ కథలో మార్పులు చేశాం’’ అన్నారు దర్శకుడు ఆర్.టి.నేసన్. ఈ వేడుకలో నిర్మాత శరత్ మరార్, దర్శకుడు జ్యోతికృష్ణ, ఎ.ఎం.రత్నం సోదరుడు దయాకర్ పాల్గొన్నారు.