కార్పోరేట్ కంపెనీలకు పవన్ కళ్యాణ్ ఝలక్!
అందరిది ఒక దారి అయితే తన దారి సెపరేట్ అంటున్నారు పవన్ కళ్యాణ్. కొందరు హీరోలు కేరీర్ ఊపులో ఉండగానే.. దీపం ఉండగానే చక్కదిద్దుకుందామనే రీతిలో సినిమాలతోపాటు అదనపు ఆదాయం కోసం వెంపర్లాడుతుంటారు. స్టార్ హోదా ను ఆసరాగా చేసుకుని.. హీరోలు సినిమాలతోపాటు అడ్వర్టైజింగ్ రంగంలో డబ్బులు దండిగా సంపాదించుకోవాలనుకుంటారు. అయితే ఇతర హీరోలకు భిన్నంగా విలువలకు ప్రాధాన్యత ఇచ్చే పవన్ కళ్యాణ్ అడ్వర్జైజింగ్ రంగంలో వచ్చిన విలువైన కాంట్రాక్టులకు నో చెబుతున్నారట.
పవన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని కార్పోరేట్ కంపెనీలు గత కొద్దికాలంగా పవర్ స్టార్ ను ప్రస్తన్నం చేసుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నాయని తెలిసింది. అత్తారింటికి దారేది చిత్ర విజయంతో పవన్ రేంజ్ ఇంకా పెరిగిపోవడంతో తమ ఉత్పత్తులకు ప్రచారం చేయాలని కంపెనీలు చేస్తున్న విశ్వ ప్రయత్నాలకు గండికొట్టారు. ప్రోడక్ట్ ప్రమోషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే భారీ మొత్తంలో డబ్బు ముట్టచెబుతామని చేసిన ఆఫర్ లను పవన్ తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం వరుస రికార్డు విజయాలతో ఊపు మీద ఉన్న పవర్ స్టార్ ను, ఆయన క్రేజ్ ను క్యాష్ చేసుకుందానే కార్పోరేట్ కంపెనీల ఆలోచనలకు పవర్ స్టార్ ఝలక్ ఇచ్చారు. విలువలకు, సిద్దాంతాలకు కట్టుబడి ఉంటారు కాబట్టే పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఎక్కువ అంటున్నారు సినీ విమర్శకులు. కష్టాల్లో ఉన్న వాళ్లను చేరదీసి ఆదుకుంటారని..ప్రచార ఆర్భాటం లేకుండా తాను చేయాలనుకునే సహాయం చేస్తారని పరిశ్రమలో టాక్. ఇవన్ని క్వాలీటీలు ఉన్నాయి కాబట్టే తెలుగు చలన చిత్రసీమలో పవన్ కు అభిమానులు ఎక్కువ.
ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉండి.. వినియోగదారులను ఎలాంటి మోసానికి గురి చేయకుండా ఉంటేనే తప్ప తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను అని చెప్పడం కంపెనీలకు దిమ్మతిరిగింది. ఫ్యాన్స్ కోసం, ప్రజల కోసం తాను తప్పుడు ప్రకటనలు చేయనని కంపెనీలకు స్పష్టం చేసినట్టు తెలిసింది. కోట్ల రూపాయలు కాదని విలువలకు కట్టుబడి ఉండేవారు అసలు కనిపించని ఈ రోజుల్లో పవన్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలను పక్కన పెట్టి హీరోలు యాడ్స్ కే ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ అనుసరిస్తున్న దారి అందర్ని ఆకట్టుకుంటోంది.