పవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త
పవన్ కల్యాణ్‌ను మళ్ళీ తెర మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ను ‘ఉగాది’ నాడు ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్ అందుకోసం శరవేగంతో పనిచేస్తోంది. శరత్ మరార్, సునీల్ లుల్లాలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని కె. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో, పేరున్న నటీనటులతో తయారవుతున్న ఈ చిత్రం షూటింగ్‌తో పవన్‌కల్యాణ్ ఇప్పుడు తెగ బిజీగా ఉన్నారు. ఒకపక్క హైదరాబాద్ నడిబొడ్డున వేసిన భారీ రతన్‌పూర్ సెట్‌లో ఎపిసోడ్, మరోపక్క శివార్లలో సంఘీ టెంపుల్ దగ్గర అటవీప్రాంతంలో జరుగుతున్న భారీ ‘గుర్రాల మేళా’ ఎపిసోడ్, చటు క్కున ఆర్.ఎఫ్.సి.లో యాక్షన్ సీక్వెన్స్ - ఇలా రోజుకోచోట విసుగూ, విరామం లేకుండా షూటింగే. పవన్ సరసన కాజల్ అగర్వాల్ నాయిక
లొకేషన్‌లో 100 గుర్రాలు... వెయ్యిమంది యూనిట్!
తాజా విశేషం ఏమిటంటే, ఈ సినిమా కోసం ‘గుర్రాల మేళా’ సీక్వెన్స్ ఒకటి చిత్రీకరించడం! ఈ సీక్వెన్స్ కోసం ఏకంగా 100 గుర్రాలు, 10 వింటేజ్ కార్లు, అనేక లగ్జరీ కార్లు తెప్పించారు. ఇక, గుర్రపు రౌతులు, ఆర్టిస్టులు కలిపి దాదాపు వెయ్యిమంది ఈ చిత్రీకరణలో పాలుపంచు కున్నారు. ప్రధాన తారాగణమైన 40 మంది ఈ సీక్వెన్స్‌లో పాల్గొన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్ర గీతాలను మార్చి మధ్యకల్లా రిలీజ్ చేయనున్నారు.
సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్న ఈ చిత్రానికి హరీశ్ పాయ్ క్రియేటివ్ హెడ్. ‘‘ఉగాది నాడు సినిమా రిలీజ్ చేయడం కోసం యూనిట్ మొత్తం దాదాపు నిద్ర లేకుండా పనిచేస్తోంది. సినిమా పూర్తయ్యే వరకు నిర్విరామంగా జరిగే ఈ షెడ్యూల్‌లో ప్రస్తుతం హీరోయిన్ కాజల్ అగర్వాల్, విలన్ శరద్ కేల్కర్, అలాగే బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, నర్రా శీను తదితరులందరూ పాల్గొంటున్నారు’’ అని చిత్ర వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. మొత్తం మీద, భారీ సెట్లు, యూనిట్‌తో సినిమా పండగలా ఉంటుందట! అంత పండగ వాతావరణం ఉన్న సినిమా ఉగాది పండగకిరావడం కరెక్టే!