
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభం
హైదరాబాద్: 'సర్దార్ గబ్బర్ సింగ్' ధియేటర్లలో ఉండగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు. ఎస్ జె సూర్య దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో నిరాడంబరంగా జరిగింది. దేవుడి చిత్రపటాలపై ముహూర్తపు షాట్ తీశారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) :
ముహూర్తపు షాట్ కు నిర్మాత సుధాకర్ రెడ్డి క్లాప్ కొట్టగా, ఎడిటర్ గౌతంరాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఎస్ జె సూర్య మొదటి సన్నివేశాన్ని డైరెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ వైట్ షర్ట్, పంచె కట్టుతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 'సర్దార్ గబ్బర్ సింగ్' నిర్మాత శరత్ మారార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫ్యాక్షన్ లీడర్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించనున్నాడు.
కాగా, ఈ సినిమాను 29న ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్-ఎస్ జె సూర్య కాంబినేషన్ లో వచ్చిన 'ఖుషి' సినిమా విడుదలై నేటికి 15 ఏళ్లు పూర్తి కావడం, ముహూర్తం కూడా కుదరడంతో ఈరోజే సినిమా ప్రారంభించారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు రెండు సినిమాలు వచ్చాయి.