పవన్‌కల్యాణ్‌కి ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం.
పవన్‌కల్యాణ్‌కి ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అందుకు ఉదాహరణగా ‘తమ్ముడు’ చిత్రంలోని ‘నబో నబో నబరి గాజులు..’, ‘గుడుంబా శంకర్’లోని ‘కిళ్లి కిళ్లి కిళ్లి కిళ్లీ.. నమిలాక బాగున్నదే..’, ‘జానీ’లో ‘నారాజు గాకుర మా అన్నయ్య..’లాంటి పాటలను చెప్పొచ్చు. ఆ పాటలకు పవన్ వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఓ రేంజ్‌లో అలరించాయి. త్వరలో విడుదల కానున్న ‘అత్తారింటికి దారేది’లో కూడా అలాంటి ఓ పాట ఉంది.
‘కాటమ రాయుడా.. కదిరి నరసింహుడా...’ అనే ఆ పాట తాలూకు వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇంతకుముందు పలు పాటలను పవన్‌కల్యాణ్ పాడినప్పటికీ వాటి విజువల్స్ బయటికి రాలేదు. కానీ ఈ పాటను పవన్ పాడుతున్నప్పుడు చిత్రీకరించి, ఆదివారం విడుదల చేశారు. ఇప్పటివరకు పవన్ పాడిన పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. యూ ట్యూబ్‌లో రెండు రోజుల్లోపే ఐదు లక్షలమందికి పైగా ఈ పాటను వీక్షించడం విశేషం. ఆ విధంగా ఇది సూపర్ డూపర్ హిట్టయ్యిందని అంచనా వేయొచ్చు. ఇక, మరో విషయం చెప్పాలంటే.. పాత హిట్ సాంగ్స్‌ని రీమిక్స్ చేయిస్తుంటారు పవన్‌కల్యాణ్. ‘మిస్సమ్మ’లోని ‘ఆడువారి మాటలకు...’ పాటను ‘ఖుషీ’ కోసం రీమిక్స్ చేయించారు.
ఆ తర్వాత ‘చిట్టి చెల్లెలు’లోని ‘ఈ రేయి తీయనిది..’ పాటను ‘జానీ’ కోసం రీమిక్స్ చేశారు. తాజాగా ‘కాటమ రాయుడు..’ పాట 1940లో విడుదలైన ‘సుమంగళి’లో నుంచి తీసుకున్నది. ఇక.. ఈ చిత్రాన్ని ఈ 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆ రోజున సినిమాని విడుదల చేయడంలేదని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రనిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్ ప్రకటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పవన్ సరసన సమంత కథానాయికగా నటించారు.