
టాలీవుడ్ నటి పూనం కౌర్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ నటి పూనం కౌర్ గురువారం ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్టు చర్చనీయాంశమైంది. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ బుధవారం తన పార్టీ ఆవిర్భావ సభలో అనూహ్యంగా టీడీపీపై విరుచుకుపడటం, చంద్రబాబు, లోకేశ్ అవినీతిపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో పూనం కౌర్ పరోక్షంగా నర్మగర్భంగా చేసిన ఈ పోస్టు వైరల్‌గా మారింది. ఇంతకు ఆమె సూటిగా ఎవరినీ ఉద్దేశించి ఈ పోస్టు పెట్టిందనే విషయం తెలియదు. కానీ, గతంలో సినీ విమర్శకుడు కత్తి మహేశ్.. పూనం కౌర్‌ను పవన్ కల్యాణ్ గర్ల్‌ఫ్రెండ్ అని అభివర్ణించడం, వారి వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు బయటపెడతాననని హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌ను ఉద్దేశించి ఆమె ఈ పోస్టు పెట్టారా? లేక ఎవరినైనా పరోక్షంగా టార్గెట్ చేశారా? అన్నది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఇంతకు ఆమె ఏం పేర్కొన్నారంటే.. ‘కాన్సెప్టులు కాపీ చేసి.. డైలాగులు కాపీ చేసి.. బట్టలు మార్చుకుంటూ.. మనుషులను మారుస్తూ.. మాట మీద ఉండకపోవడం.. జనాల ఇన్నోసెన్స్ (అమాయకత్వం)తో ఆడుకుంటూ.. వేషాభాషలు మారుస్తూ.. జనాలను మభ్యపెట్టి.. అమ్మాయిలను అడ్డంపెట్టుకుంటూ.. రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది. ఆ భగవంతుడే నిజం ఏంటో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని పూనం కౌర్ ఫేస్‌బుక్‌లోని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాన్సెప్టులు, డైలాగులు కాపీ చేస్తూ.. వేషాభాషాలు మారుస్తూ.. జనాల అమాయకత్వంతో ఆడుకుంటూ.. అమ్మాయిలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది ఎవరు? ఇలా ప్రజల్ని మభ్యపెడుతుంది ఎవరు? అన్నది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ విషయంలో నెటిజన్లు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
పవిత్రమైన గురుగోవింద్ సింగ్ జయంతి ఉత్సవం సందర్భంగా తాను అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని దర్శించుకున్నటు ఇతర పోస్టుల్లో పూనం కౌర్ తెలిపారు. ‘ప్రతీ పనికి ఎదో కారణం వెతుకుతుంది ఈ కాలం. మనిషి జన్మకొక కారణం.. మనిషి మరణానికి మరో కారణం.. మనసుల కలయిక ఒక కారణం. ఎడబాటుకి ఇంకో కారణం. కానీ ఎప్పుడూ ఒంటరితనమే తన బహుమానం. నిరాశా నిస్పృహలు రాగాలు ఆలపిస్తుంటే మహిళ తన గుండెల్లో పెల్లుబికే దుఖాన్ని తన గొంతులోనే సవరించుకుంటూ తనను తానూ నిందించుకుంటూ ఈ లోకంలో కాలం వెళ్లదీస్తుంది. కానీ ఇప్పుడా రోజులు పోయాయి. అన్యాయం చేసినప్పుడు అక్రమం జరిగినప్పుడు గురుగోవింద్ సింగ్ లాంటి అవతారపురుషులు దానిని చీల్చి చెండాడడానికి సత్యాన్ని కాపాడడానికి ఈ లోకంలో అవతరిస్తారు... మళ్లీ మళ్లీ అవతరిస్తూనే ఉంటారు. ఒక స్ఫురణ లో ఒక ఎరుకలో ఒక జ్ఞాపకంలో మళ్లీ మళ్లీ పుడుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నా’అని ఆమె మరో పోస్టులో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment