∙వంశీకృష్ణ ఆకెళ్ళ, ‘దిల్’ రాజు, గురురాజ్, ఎమ్మెస్ రాజు
‘బాహుబలి’లో కాలకేయగా, అంతకు ముందు పలు చిత్రాల్లో విలన్‌గా నటించిన ప్రభాకర్ ఇప్పుడు హీరో తరహా పాత్రలు చేస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ‘రైట్... రైట్’లో పాజిటివ్ క్యారెక్టర్ చేశారు. త్వరలో ‘రక్షక భటుడు’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రిచా పనయ్, ‘బాహుబలి’ ప్రభాకర్, పృథ్వి, సప్తగిరి, బ్రహ్మాజీ ముఖ్యతారలుగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘రక్షక భటుడు’.
సుఖీభవ మూవీస్ పతాకంపై ఎ. గురురాజ్ తొలి ప్రయత్నంగా నిర్మిస్తోన్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను శనివారం నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. సంస్థ లోగోను మరో నిర్మాత ఎమ్మెస్ రాజు విడుదల చేశారు. ‘‘కొత్త కథతో క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఈ సినిమా చేస్తున్నాను. రెండు గంటల సినిమాలో చివరి 15 నిమిషాలు థ్రిల్లింగ్‌గా, మిగతాదంతా వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు వంశీకృష్ణ ఆకెళ్ల. ‘‘ఫిబ్రవరిలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అన్నారు ఎ. గురురాజ్. ఎస్.ఎల్. గ్రూప్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి, సినిమాటోగ్రాఫర్ జోషి పాల్గొన్నారు.