
వెండితెర బాహుబలి
అమీర్‌పేట్‌కి.. ధూల్‌పేటకి అంటూ తొలి చిత్రం ‘ఈశ్వర్’లో ప్రభాస్ చేసిన సందడి అతన్ని ‘మాస్’కి దగ్గర చేసేసింది... ‘మెల్లగా కరగని రెండు మనసుల దూరం..’ అంటూ ‘వర్షం’లో చిన్న చిన్నగా చిందేసి ‘రొమాంటిక్’ యాక్షన్ హీరో అనిపించేసుకున్నారు. ‘జగమంత కుటుంబం నాది..’ అంటూ సెంటిమెంట్ పండించేసి తనలో మంచి ‘ఎమోషనల్ హీరో’ ఉన్నాడని ప్రూవ్ చేసేసుకున్నారు. ‘ఒక్క అడుగు...ఒకే ఒక్క అడుగు’ అంటూ విలన్లను రఫ్ఫాడించేసి, మన యంగ్ రెబల్‌స్టార్ ‘ఛత్రపతి’ అని అభిమానులతో అనిపించుకున్నారు. అందరికీ ‘డార్లింగ్’ అయ్యి, ఓవరాల్‌గా ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ అనిపించేసుకున్నారు.
ఈ ఆరడుగుల ఆజానుబాహుడు ఈసారి ‘బాహుబలి’గా విజృంభిస్తే, ‘ఇలాంటి పాత్రలకు యాప్ట్ అయిన హీరో ఇతనే’ అని అందరూ ఆమోదించేలా చేయగలిగారు. అందుకే.. ఇప్పుడు ప్రభాస్ ‘ఆల్ రౌండర్’. రేపు ప్రభాస్ అభిమానులకు పండగ రోజు. ఎందుకంటే రేపు శుక్రవారం ఈ యంగ్ రెబల్‌స్టార్ పుట్టినరోజు. వచ్చే ఏడాది ‘బాహుబలి 2’ ద్వారా మళ్లీ ప్రేక్షకులను అలరించే పని మీద ఉన్నారు ప్రభాస్.