వెండితెరకు మాటలొస్తే అద్భుతం అంటుంది!
– దర్శకుడు కె. రాఘవేంద్రరావు
‘‘వెండితెరకు మాటలొస్తే.. మాట్లాడాల్సి వస్తే.. ‘బాహుబలి 2’ వంటి గొప్ప అద్భుతాన్ని నాపై ఆవిష్కరిస్తారని జన్మలో అనుకోలేదు. ట్రైలరే ఇలా ఉంటే ఏప్రిల్ 28న థియేటర్స్‌లో ఈ అద్భుతం ఎంత బాగుంటుందో అని చెబుతుంది’’ అన్నారు దర్శకులు కె.రాఘవేంద్రరావు. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ, నాజర్ ముఖ్య తారలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో కె.రాఘవేంద్రరావు సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి–2’ ట్రైలర్ విడుదల గురువారం హైదరాబాద్‌లో జరిగింది.
రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘ఇటువంటి గొప్ప చిత్రాన్ని అందిస్తున్నందుకు హాట్సాఫ్ టు రాజమౌళి అండ్ టీమ్. ‘బాహుబలి–2’ వంటి అద్భుతాన్ని తెరపై చూడటానికి ప్రేక్షకులు ఏప్రిల్ 28 వరకు ఆగాల్సిందే. అప్పటివరకూ నేనైతే ప్రతిరోజూ పదిసార్లు ఈ ట్రైలర్ చూస్తా’’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘బాహుబలి’ సినిమా చాలా పెద్ద కథ కావడంతో రెండు భాగాలుగా తీశాం.
ప్రతి క్యారెక్టర్‌ను అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశాం. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే విషయాన్ని సింగిల్ లైన్‌లో చెప్పలేను. సినిమా చూసి తెలుసుకోవాలి’’ అన్నారు. ‘‘ట్రైలర్ చూసి నా ఐదేళ్ల కష్టం మరచిపోయా. ఇంత గొప్ప సినిమాలో అవకాశం కల్పించిన రాజమౌళి అండ్ టీమ్‌కు కృతజ్ఞతలు’’ అన్నారు ప్రభాస్. ‘‘నటుడిగా నేను తెరంగేట్రం చేసి ఏడేళ్లయింది. అందులో ‘బాహుబలి’ సినిమా కోసమే ఐదేళ్లు కష్టపడ్డా. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రుతతో ఉన్నా’’ అన్నారు రానా. ఎం.ఎం.కీరవాణి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, కెమెరామేన్ కె.కె. సెంథిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.