గాయకుడిగా ప్రభుదేవా
మల్టిపుల్ టాలెంటెడ్ కళారులు అతి కొద్ది మందిలో ప్రభుదేవా ఒకరని చెప్పొచ్చు. చిన్న వయసు నుంచే నృత్యకళారంగంలో తన పనితనంతో సినీ వర్గాలను అబ్బుర పరచిన ప్రభుదేవా అంతటితోనే ఆగిపోకుండా ఇతర శాఖలపై మక్కువ చూపారు. ఫలితం నటన, దర్శకత్వం రంగాల్లోనే తన ప్రతిభను చాటుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ అంటూ బహుభాషా దర్శకుడిగా విజయాలను సాధిస్తున్నారు. ఇవాళ భారతీయ సినిమాలో ప్రభుదేవా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రతిభ అన్నది ఎవరి సొత్తు కాదు. శ్రమ, పట్టుదల, కృషి ఈ మూడూ ఉంటే ఎవరైనా సాధించవచ్చుననడానికి ప్రభుదేవా ఒక ఉదాహరణ.
నృత్యదర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి తాజాగా నిర్మాతగా మారి ఒకేసారి ఏకంగా మూడు చిత్రాలు నిర్మిస్తున్నారు. ప్రభుదేవా అంతటితో సంతృప్తి చెందలేదు. ఇప్పుడు కొత్తగా గాయకుడిగా అవతారమెత్తారు. తాను దర్శకత్వం వహిస్తున్న సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రం కోసం ఒక పాటను అలవోకగా పాడేశారు. ఈయనలోని గాయకుడ్ని కనుగొన్నది బాలీవుడ్ సంగీత దర్శకుడు సందీప్‌శిరోద్కర్ ప్రభుదేవా పాత హిందీ పాటల్ని లయబద్ధంగా పాడేస్తుండడం చూసిన సందీప్‌శిరోద్కర్ సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రంలోని పాటను పాడమన్నారట. ప్రభుదేవా పాట చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందంటున్నారు ఆ చిత్ర వర్గాలు.