
అప్పుడు దర్శకత్వంలో ఇప్పుడు జంటగా..
ఎంతటి వారికైనా గ్యాప్ రావడం అన్నది సహజం. ప్రతిభ ఉన్నవారికి ఆ గ్యాప్ ఎంతో కాలం కొనసాగదు. అందులోనూ అందం కూడా మెండుగా ఉన్న నటి హన్సిక లాంటి వారికి చిన్నగ్యాప్ పెద్ద సమస్య కానేకాదు. ఈ మధ్యనే రోమియో జూలియట్, భోగన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన హన్సిక ఆ తరువాత కోలీవుడ్‌లో నూతన అవకాశాలు రావడానికి కాస్త సమయం పట్టింది. దీంతో హన్సిక పనైపోయింది. మూటాముల్ల సర్దుకుంది అనే టాక్ వేగంగా ప్రచారమైంది.
అలాగే ఒక మలయాళ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అలాగని ఈ బ్యూటీ కాళీగా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోలేదు. టాలీవుడ్‌లో ఒక చిత్రం చేస్తూ బిజీగానే ఉన్నారు. తాజా సమాచారం ఏమిటంటే కోలీవుడ్‌లో మరో క్రేజీ ఆఫర్ హన్సిక తలుపు తట్టింది. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో రొమాన్స్ చేస్తున్నారు. చాలా కాలం క్రితం దక్షిణాది వదిలి ఉత్తరాది సినిమాలో జెండా పాతి అక్కడ తనదైన ముద్ర వేసుకున్న ప్రభుదేవా ఇటీవల దేవి చిత్రంతో కథానాయకుడిగా రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు.
భోగన్ చిత్రంతో నిర్మాతగా కూడా అవతారమెత్తిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఇప్పుడు హీరోగా, డైరెక్టర్‌గా చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే నవ దర్శకుడు అర్జునకు అవకాశం ఇచ్చి యగ్ మంగ్ జంగ్ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు.ఇందులో ఆయనతో నటి లక్ష్మీమీనన్ రొమాన్స్ చేస్తోంది. మరో పక్క ఆయన మాజీ ప్రియురాలు నయనతార ప్ర«ధాన పాత్రను పోషిస్తున్న కోలైయుదీర్ కాలం చిత్ర హిందీ రీమేక్‌లో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇక నటుడు విశాల్, కార్తీ హీరోలుగా కరుప్పురాజా వెళ్‌లైరాజా చిత్రానికి మెగాఫోన్ పట్టారు.ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ సాయేషా నాయకి. కాగా కథానాయకుడిగా మరో చిత్రానికి కూడా ప్రభుదేవా పచ్చజెండా ఊపారని, ఇందులో నటి హన్సిక నాయకిగా నటిస్తున్నారన్న సమాచారం కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉందని, దీనికి గులేభాహావళి అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారని తెలిసింది. దీనిని నవదర్శకుడు కర్ణన్ తెరకెక్కిస్తున్నారు.అమ్మడు హన్సిక ఇంతకు ముందు ప్రభుదేవా దర్శకత్వంలో ఎంగేయుమ్ కాదల్ చిత్రంలో నటించారు. తాజాగా ఆయనతో డ్యూయెట్లు పాడుతున్నారన్నమాట.