
అదిరేటి స్టెప్పు మీరేస్తే..!
‘‘స్టెప్పులు ఇరగదీయడంలో అన్నయ్యతర్వాతే ఎవరైనా! ఆయన స్టెప్పులు సూపర్. ‘వానా వానా వెల్లువాయె’ అంటూ చిరు డ్యాన్సు చేస్తుంటే చూడ్డానికి రెండు కళ్లూ చాలవనుకో. ‘బంగారు కోడిపెట్ట వచ్చెనండి...’ అని స్టెప్పేస్తే కాలు కదపలేకుండా ఉండలేమనుకో’’ అని చిరంజీవి డ్యాన్సుల గురించి ఫ్యాన్స్ మురిసిపోతూ చెప్పుకుంటారు. ఈ రెండు పాటలకూ స్టెప్పులు సమకూర్చింది ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా అని తెలిసే ఉంటుంది. ఇవే కాదు.. ఇంకా చిరంజీవి చాలా పాటలకు ప్రభుదేవా స్టెప్స్ సమకూర్చారు. ఇప్పుడు మరోసారి చిరూ కోసం ప్రభుదేవా అదిరేటి స్టెప్పులు సమకూరుస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం చిరంజీవి నటించిన ‘శంకర్‌దాదా జిందాబాద్’కి దర్శకత్వం వహించింది ప్రభుదేవానే.
ఆ సినిమాకి కొరియోగ్రఫీ చేసింది కూడా ఆయనే. ఇప్పుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీకి స్టెప్పులు సమకూర్చే పనిలో బిజీగా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుదేవా స్పష్టం చేశారు. ‘శంకర్‌దాదా జిందాబాద్.. ఊ...ఆ.. ’ అంటూ చిరంజీవి జోష్‌గా డ్యాన్స్ చేయడానికి వీలున్న ట్యూన్ ఇచ్చిన దేవిశ్రీప్రసాద్ తాజా చిత్రానికి పాటలు స్వరపరుస్తున్నారు. ఈ ట్యూన్స్ చిరు అభిమానులు ఆహా.. ఓహో.. అనేలా ఉంటాయని ఊహించవచ్చు.