
నెస్ నన్ను సిగరెట్లతో కాల్చాడు: ప్రీతిజింటా
ముంబై: బాలీవుడ్ నటి ప్రీతిజింటా తన మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త నెస్ వాడియాపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. నెస్ వాడియా గతంలో తనను సిగరెట్లతో కాల్చాడని ప్రీతి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నెస్ వాడియా తనను గదిలో ఉంచి బంధించేవాడని ముంబై పోలీస్ కమిషనర్కు రాసిన లేఖలో ప్రీతి పేర్కొంది. కొన్నిసార్లు అతను భయంకరంగా ప్రవర్తించేవాడని తెలిపింది. తనను చంపేస్తాడేమోనని ఆందోళన చెందానని పేర్కింది. అతని ఆగడాలను భరించలేక ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో అతనికి దూరమయ్యానని ప్రీతిజింటా చెప్పింది. ఐపీఎల్ సందర్భంగా నెస్ తనను దూషించి చేయి చేసుకున్నాడని ప్రీతి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఐదేళ్ల పాటు కలసిమెలసి తిరిగిన ఈ జంట ఆనక విడిపోయింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ లెవెన్ పంజాబ్లో ప్రీతి, నెస్ ఇద్దరూ సహ భాగస్వాములు.