
అదే టెన్షన్ వీళ్లల్లో చూస్తున్నాను - అనుష్క
‘‘నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. అందులోనూ మెలొడీస్ అంటే చెవి కోసుకుంటాను. ఈ సినిమా పాటలు విన్నాను. శ్రవణ్ మంచి పాటలిచ్చాడు. ఆడియో బాగున్నట్లే, సినిమా కూడా బాగుంటుందని నా నమ్మకం’’ అని అనుష్క అన్నారు. డి.సురేష్‌బాబు సమర్పణలో హర్షవర్దన్ రాణే, వితిక శేరు, విష్ణువర్దన్, రీతువర్మ, హరీష్, శ్రీముఖి ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘ప్రేమ ఇష్క్ కాదల్’. పవన్ సాదినేని దర్శకుడు. బెక్కం వేణుగోపాల్ నిర్మాత. ఈ చిత్రం ఆడియో సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న అనుష్క ఇంకా మాట్లాడుతూ -‘‘నా తొలి చిత్రం ‘సూపర్’లో నటిస్తున్నప్పుడు నేనెంత టెన్షన్ పడ్డానో, అదే టెన్షన్ ఈ టీమ్ కళ్లల్లో చూస్తున్నాను.
పాటలు, ప్రచార చిత్రాలు చూశాక ఈ సినిమాకోసం వీరెంత ఎఫర్ట్స్ పెట్టారో అర్థమవుతోంది. నిర్మాత వేణుగోపాల్ నాకు ఆరేళ్లుగా తెలుసు. నేను అన్నయ్య అని పిలుస్తాను. రొటీన్ చిత్రాలు కాకుండా మంచి సినిమాలు తీయాలని తపన పడే వ్యక్తి ఆయన. ఈ సినిమా ఆయన అభిరుచికి తగ్గట్టు ఉంటుందనుకుంటున్నా’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు ఎంవీకె రెడ్డి, గుత్తా జ్వాల, మధుర శ్రీధర్, అతిథి చంగప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.