నాన్న కూతుర్ని!
చేసే పనిలో ఆనందం వెతుక్కుంటే అలుపూ సొలుపూ తెలియదు. కానీ, అదే పనిగా పని చేసినా జీవితం బోర్ కొట్టేస్తుంది. అందుకే, అప్పుడప్పుడూ రిలాక్స్ అవ్వాలి. ఇటీ వల ప్రియమణి అలానే రిలాక్స్ అయ్యింది. అయితే, ఇక్కడ కాదు. ఏకంగా బ్యాంకాక్‌లో. అక్కడి టైగర్స్ టెంపుల్ వెళ్లి, ఏకంగా పులిని వళ్లో పడుకోబెట్టుకుని ఫొటో కూడా దిగారామె. అలాగే జలపాతాల దగ్గరికెళ్లి ఎంజాయ్ చేశారు. ఇలా బాగా ఎంజాయ్ చేసి, స్వదేశం తిరిగొచ్చారామె.
ఈ విషయాలన్నీ ఒక ఎత్తయితే... ప్రియమణి వేయించుకున్న టాటూ మరో ఎత్తు. మామూలుగా టాటూ అంటే, ఏదో ఒక సింబల్‌నో, ఇష్టమైన పేరుకి సంబంధించిన అక్షరాలనో సెలక్ట్ చేసుకుంటారు. కానీ, ప్రియమణి మాత్రం తన తండ్రి మీద అభిమానం చాటుకునే విధంగా ‘డాడీస్ గాళ్’ అని టాటూ వేయించుకున్నారు. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా గతంలో ‘డాడీస్ లిటిల్ గాళ్’ అనే టాటూతో తండ్రి మీద అభిమానం చాటుకున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకునే నేను కూడా ఇలాంటి టాటూని ఎంపిక చేసుకున్నా అని ప్రియమణి పేర్కొన్నారు.