ఒబామా చాలా ఫన్నీ!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇంట్లో విందు ఆరగించే అవకాశం రావడం అంటే మాటలు కాదు. అమెరికన్ ప్రముఖులకు ఆ చాన్స్ దక్కడమే కష్టం అంటే.... ఇక భారతీయ ప్రముఖులకు దక్కడం అంటే ఇంకా కష్టం. అందుకే ఒబామా అధికారిక నివాసం వైట్‌హౌస్ నుంచి డిన్నర్ చేసే అవకాశం దక్కించుకున్నవాళ్ల గురించి గొప్పగా చెప్పుకుంటారు.
ఇప్పుడు ప్రియాంకా చోప్రా గురించి అలానే చెప్పుకుంటున్నారు. అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’ ద్వారా అక్కడ బాగా ఫేమస్ అయిన ప్రియాంక, ప్రస్తుతం హాలీవుడ్ చిత్రం ‘బేవాచ్’లో నటిస్తున్నారు. ఇటీవల ఆస్కార్ అవార్డుల వేడుకలో పాల్గొనడం ద్వారా ఆమె పాపులార్టీ మరింత పెరిగిపోయింది. బహుశా.. అదే ఒబామాతో డిన్నర్ చేసే అవకాశం ప్రియాంకకు తెచ్చిపెట్టి ఉంటుందని ఊహించవచ్చు. బరాక్ ఒబామా పదవీ కాలం ముగియనుంది. ఈ సందర్భంగా వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో శనివారం రాత్రి డిన్నర్ ఇచ్చారు.
ఈ విందుకు బాలీవుడ్ కథానాయిక ప్రియాంకా చోప్రాకు వైట్‌హౌస్ కరస్పాండెట్స్ నుంచి ఆహ్వానం అందడం, ఆమె వెళ్లడం జరిగాయి. ‘‘ఒబామా, మిషెల్లీ ఒబామా (ఒబామా సతీమణి)తో డిన్నర్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఒబామా చాలా ఫన్నీ.. చార్మింగ్’’ అని ట్విట్టర్ ద్వారా ప్రియాంకా చోప్రా తన అనుభూతిని పంచుకున్నారు.